క్రీడాస్ఫూర్తితో ఉన్నత శిఖరాలకు..
గద్వాల: ప్రతి క్రీడాకారుడికి క్రీడాస్ఫూర్తి ముఖ్యమని, దీని వల్లే భవిష్యత్‌లో ఉన్నత శిఖరాలకు చేరుకుంటారని ఎస్పీ శ్రీనివాసరావు అన్నారు. జిల్లాకేంద్రంలోని మల్టీపర్పస్ ఇండోర్ స్టేడియంలో సీఎం కప్ క్రీడా పోటీలు ఘనంగా ప్రారంభమయ్యాయి. ఇందులో భాగంగా శనివారం కబడ్డీ, వాలీబాల్, ఖోఖో జిల్లాస్థాయి పోటీలను ఎస్పీ ప్రారంభించి మాట్లాడారు. ప్రతి క్రీడాకారుడు జాతీయస్థాయి పోటీలను లక్ష్యంగా నిర్దేశించుకొని ఆడాలని సూచించారు. ప్రతి క్రీడాకారుడు క్రీడా స్ఫూర్తి ప్రదర్శించాలని సూచించారు. చదువుతోపాటు క్రీడలలోనూ రాణించాలన్నారు. క్రీడల వల్ల శారీరక దృఢత్వంతోపాటు మానసికంగా బలంగా తయారవుతారని చెప్పారు. గెలుపోటముల కంటే పోటీల్లో క్రీడాస్ఫూర్తిని ప్రదర్శించడం చాలా ముఖ్యం అన్నారు. పట్టుదల, శ్రద్ధ అనేది క్రీడల వల్ల అలవడతాయన్నారు. అనంతరం ఎస్పీ క్రీడాకారులను పరిచయం చేసుకుని వాలీబాల్ సర్వీస్ చేసి పోటీలను లాంఛనంగా ప్రారంభించారు. సాయంత్రం గెలుపొందిన జట్లకు ఎస్పీ మెడల్స్‌తోపాటు ప్రశంసాపత్రాలను అందజేసి అభినందించారు. కార్యక్రమంలో డీవైఎస్‌ఓ కృష్ణయ్య, సీఐ శ్రీనివాసులు, ఎస్‌జీఎఫ్ జిల్లా కార్యదర్శి శ్రీనివాసులు తదితరులు పాల్గొన్నారు.
ప్రతిభను వెలికితీసేందుకే..
ఎర్రవల్లి: గ్రామీణ క్రీడాకారుల్లో దాగి ఉన్న ప్రతిభను వెలికితీసేందుకే ప్రభుత్వం సీఎం కప్ క్రీడలు నిర్వహిస్తుందని డీవైఎస్‌ఓ కృష్ణయ్య అన్నారు. శనివారం ఎర్రవల్లిలోని ఓ పాఠశాలలో జిల్లాస్థాయి బాస్కెట్‌బాల్ సీఎం కప్ పోటీలను ఆయన ప్రారంభించి మాట్లాడారు. క్రీడాకారులు క్రీడా స్ఫూర్తిని చాటుతూ పోటీల్లో ప్రతిభను నిరూపించుకోవాలన్నారు. గ్రామస్థాయి నుంచి క్రీడాకారులు ప్రపంచ స్థాయికి ఎదగాలనే సదుద్దేశంతో ప్రభుత్వం ఈ పోటీలను నిర్వహిస్తుందని, వీటిని సద్వినియోగం చేసుకొని ఉన్నత శిఖరాలకు చేరుకోవాలన్నారు. కార్యక్రమంలో జిల్లా ఒలింపిక్ అసోసియేషన్ ప్రధాన కార్యదర్శి శ్రీనివాసులు, పాఠశాల చైర్మన్ గోవర్ధన్‌రెడ్డి, డైరెక్టర్ శ్రీనివాస్‌రెడ్డి, పీడీలు నగేష్, బాబు, సతీష్, బషీర్ తదితరులు పాల్గొన్నారు.


