బీమా రంగంలో ఎఫ్‌డీఐ పరిమితి పెంపు అనవసరం
గద్వాలన్యూటౌన్: బీమా రంగంలో ఎఫ్‌డీఐ (విదేశీ ప్రత్యక్ష పెట్టుబడులు) పెంపు అనవసరమని ఆలిండియా ఇన్సూరెన్స్ ఎంప్లాయిస్ అసోసియేషన్ (ఏఐఐఈఏ) బ్రాంచ్ కార్యదర్శి బంగి రంగారావు అన్నారు. సోమవారం గద్వాల ఎల్‌ఐసీ బ్రాంచ్ ఆవరణలో విలేఖర్ల సమావేశం నిర్వహించి మాట్లాడారు. 2025 డిసెంబర్12న కేంద్ర ప్రభుత్వం ప్రో క్యాపిటెల్ ఆర్థిక సంస్కరణలకు ఆమోదం తెలిపిందని, ఇందులో బాగంగా బీమా రంగంలో ఎఫ్‌డీఐ పరిమితిని వంద శాతానికి పెంచడంతో పాటు బీమా చట్టాల (సవరణ) కూడా ఉందన్నారు. అయితే 1999లో ఐఆర్‌డీఏ బిల్లును ఆమోదించడం ద్వార బీమా రంగాన్ని జాతియీకరణ నుంచి విముక్తి చేశారని చెప్పారు. అప్పటి నుంచి విదేశీ భాగస్వాములతో కూడిన అనేక ప్రైవేట్ బీమా సంస్థలు జీవిత బీమా, సాధారణ బీమా రంగాల్లో కార్యకలాపాలు నిర్వహిస్తున్నాయన్నారు. ఈసంస్థలకు వ్యాపారం నిర్వహించడానికి మూలధనం సమస్య కాలేదన్నారు. వాస్తవానికి బీమా రంగంలో వినియోగిస్తున్న మొత్తం మూలధనంలో ఎఫ్‌డీఐ వాటా సుమారు 32శాతం మాత్రమే అని పేర్కొన్నారు. ఇలాంటి పరిస్థితుల్లో బీమా రంగంలోఎఫ్‌డీఐ పరిమితిని వంద శాతానికి పెంచచి మూలధనానికి సంపూర్ణ స్వేచ్ఛ ఇవ్వడం మంచి నిర్ణయం కాదన్నారు. ఈ నిర్ణయం బీమా సంస్థలపై ప్రతికూల ప్రభావాలు చూపిస్తుందని చెప్పారు. దీనివల్ల బీమారంగం క్రమబద్దంగా అభివృద్ధి చెందకుండా, లాభాలపై మాత్రమే దృష్టి కేంద్రీకృతమవుతుందని, ప్రజలకు, వ్యాపార రంగానికి అవసరమైన భద్రత అందించడంలో వెనకబడుతుందన్నారు. కార్పొరేట్ పక్షపాతంతో కూడిన ఆర్థిక విధానాల నుంచి ప్రజా కేంద్రీకృత విధానాల వైపు ప్రభుత్వం మళ్లాలని డిమాండ్ చేశారు. సమావేశంలో రాఘవేంద్ర, ఉదయ్ కుమార్, సూరజ్, లక్ష్మీకాంత్, కృష్ణచైతన్య తదితరులు పాల్గొన్నారు.


