ప్రచారానికి తెర
● ముగిసిన మూడో విడత ప్రచార పర్వం
● ఓటర్లను ప్రలోభపెట్టే పనిలో మద్దతు పార్టీలు
● ఐదు మండలాల్లోని 75 పంచాయతీలు, 700 వార్డుల్లో ఎన్నికలు
● రేపటి పోలింగ్‌కు అధికార యంత్రాంగం సన్నద్ధం
అలంపూర్: పంచాయతీ పోరులో మూడో విడత ప్రచారానికి తెర పడింది. ఓటర్లను ప్రసన్నం చేసుకోవడానికి నువ్వా నేరా అన్నట్లుగా సర్పంచ్, వార్డుసభ్యులు ప్రచారంలో పోటీపడ్డారు. ప్రచార పర్వంలో చివరి రోజైన సోమవారం అభ్యర్థులు క్షణం తీరిక లేకుండా ఎక్కువ మంది ఓటర్లను కలిసి ఓటును అభ్యర్థించారు. మూడో విడత పంచాయతీ ఎన్నికల్లో భాగంగా సోమవారం ప్రచారానికి గడువు ముగిసింది. అనంతరం ఎన్నికల అధికారుల అదేశాలు, పోలీసుల సూచనల మేరకు సాయంత్రం 5 గంటలకు తమ ప్రచారాన్ని ముగించారు. గత కొన్ని రోజులుగా ప్రచారంతో సందడిగా మారిన గ్రామాలు సమయం ముగియడంతో ఒక్కసారిగా నిశబ్ద వాతావరణంలోకి వెళ్లాయి. ప్రచార పర్వంలో ప్రసన్నం చేసుకున్న ఓటర్లు చేదాటకుండా అభ్యర్థులు ప్రయత్నాలు మొదలెట్టారు.
75 పంచాయతీలకు ఎన్నికలు
జిల్లాలో మూడో విడత ఎన్నికల్లో ఐదు మండలాలకు ఎన్నికల కమిషన్ నోటిఫికేషన్ జారీ చేసింది. అలంపూర్ నియోజకవర్గంలోని ఐదు మండలాల్లో మూడో విడతలో ఎన్నికలు జరగనున్నాయి. అలంపూర్ మండలంలోని 14 గ్రామ పంచాయతీలు, 120 వార్డులు, ఉండవెల్లిలో 15 జీలు, 142 వార్డులు, మానవపాడులో 17 జీపీలు, 164 వార్డులు, ఇటిక్యాలలో 14 జీపీలు, 130 వార్డులు, ఎర్రవల్లి మండలంలో 15 జీపీలు, 144 వార్డుల్లో ఎన్నికలు జరగనున్నాయి. ఈ నెల 3వ తేదీ నుంచి 5 వరకు నామినేషన్లు స్వీకరించారు. నామినేషన్ల అమోదం, పరిశీలన అనంతరం 9న నామినేషన్ల ఉపసంహరణ ముగించారు. 9న పోటీలో ఉన్న అభ్యర్థులకు గుర్తులు కేటాయించారు. అప్పటి నుంచి అభ్యర్థులు 6 రోజులపాటు ఓటర్లను ప్రసన్నం చేసుకోవడానికి పోటా పోటీగా ప్రచారం నిర్వహించారు. మూడో విడతలో 75 పంచాయతీలు, 700 వార్డులకు ఎన్నిక నోటిఫికేషన్ జారీ చేశారు. నామినేషన్ల స్వీకరణ, నామినేషన్ల ఉపసంహరణ వరకు 7 గ్రామ పంచాయతీలు, 136 వార్డులు ఏకగ్రీవం అయ్యాయి. ప్రస్తుతం 68 గ్రామ పంచాయతీలు, 564 వార్డులకు ఈ నెల 17వ తేదీన పోలింగ్ జరగనుంది. ప్రచారం పర్వం ముగియడంతో అధికారులు పోలింగ్ ఏర్పాట్లలో నిమగ్నమయ్యారు. పోలీసులు సైతం ప్రచార సమయం ముగిసిన తర్వాత గ్రామాల్లో పర్యటించారు. ఎన్నికల నిబంధనల మేరకు సమయం ముగిసిన తర్వాత పోటీలో ఉన్న అభ్యర్థులు ప్రచారం చేయరాదని ప్రజలకు అవగాహన కల్పించారు.
ప్రచారానికి తెర


