ఓటర్లకు తాయిలాలు..
● పోలింగ్‌కు ఒక్కరోజే సమయం
● ప్రలోభాలకు తెరలేపిన సర్పంచ్, వార్డు అభ ్యర్థులు
● రాత్రికి రాత్రే కాలనీల్లో గ్రామాల్లో మద్యం, డబ్బులు పంపిణీ
గద్వాలటౌన్: పోలింగ్‌కు ఒక్క రోజే సమయం ఉండడంతో సర్పంచ్, వార్డుసభ్యులు ప్రలోభాలకు తెరలేపారు. ఓటర్లకు తాగినంత మద్యం పోస్తూ.. అడిగినన్ని డబ్బులు ఇస్తున్నారు. ప్రస్తుతం ఓటరు చొప్పున విడదీస్తూ రూ.500 నుంచి రూ.2000 వరకు చెల్లిస్తూ వారి ఓట్లను ఆశిస్తున్నారు. ఈ క్రమంలో గ్రామంలోని ఓటర్లను ఆకట్టుకునేందుకు నాయకులు పడరాని పాట్లు పడుతున్నారు. రాత్రికి రాత్రే కాలనీల్లో రహస్యంగా పర్యటిస్తూ మద్యం, డబ్బులను విచ్చలవిడిగా ఓటర్లకు అందిస్తున్నారు. ప్రస్తుత ఎన్నికల వాతావరణంలో ఓటర్లు సైతం నాయకులు, కార్యకర్తలను తమ ఇష్టాలకు ఉపయోగించుకుంటున్నారు. తమ ఇంట్లో ఇన్ని ఓట్లు ఉన్నాయంటూ అభ్యర్థులను నమ్మిస్తూ డబ్బులు ఆశిస్తున్నారు. అభ్యర్థులు సైతం అడిగిందే తడవుగా వేలాది రూపాయలు గుప్పిస్తున్నారు. డబ్బులు, మద్యంతో పాటు కాలనీల్లో యువకులకు అవసరమయ్యే క్రికెట్ కిట్లు, ఇతర వస్తు సామగ్రిని అభ్యర్థుల నుంచి బలవంతంగా అడిగి పుచ్చుకుంటున్నారు. మహిళలకు ఇంటికి వెళ్లి చీరలను అందజేశారు. ఓట్లను ఆశిస్తున్న నాయకులు సైతం కాదనకుండా అందిస్తున్నారు. 17న జిల్లాలో మూడో విడత ఎన్నికలు జరిగే ఐదు మండలాల్లో భారీగా ఓటర్లకు మద్యం అందజేసేందుకు.. రహస్యంగా మద్యం నిల్వలను ఇప్పటికే ఏర్పాటు చేసి పంపిణీ చేశారు. దాదాపు అన్ని గ్రామాలలో ‘ఓటుకు నోటు’ అనే సంప్రదాయం కొనసాగుతోంది. డబ్బులు, మద్యాన్ని వివిధ పార్టీల అభ్యర్థులు ఎర చూపుతుండటంతో కార్యకర్తల్లో కూడా డబ్బులు సందడి స్పష్టంగా కనిపిస్తోంది.
ఫోన్లతో ఉక్కిరిబిక్కిరి..
ఇదిలా ఉండగా నాయకుల ఫోన్లు బిజీగా మారాయి. ఒక్కో గ్రామం నుంచి ఛోటా మోటా నేతలు, కార్యకర్తలు, వివిధ సంఘాల నాయకుల నుంచి వచ్చే ఫోన్లతో అభ్యర్థులు ఉక్కిరి బిక్కిరయ్యారు. ‘అన్నా ఇప్పుడే అవతలి పార్టీకి సంబంధించిన వారు వచ్చి ఇక్కడ డబ్బు పంచారు..’ ‘అన్నా ఫలానా వారికి మందు సీసాలు సఫ్‌లై చేయాలి’ అన్న వార్తలతో నేతల ఫోన్లు నిర్విరామంగా మోగాయి.


