ధన్వాడ: అత్తాకోడళ్ల మధ్యే..!
నారాయణపేట ఎమ్మెల్యే పర్ణికారెడ్డి, మహబూబ్‌నగర్ ఎంపీ డీకే అరుణ సొంతూరు ధన్వాడ. మండలకేంద్రమైన ఈ గ్రామ సర్పంచ్ పదవి బీసీ మహిళకు రిజర్వ్ అయింది. ఇక్కడ రెండో విడతలో జరుగుతున్న ఎన్నికల్లో సర్పంచ్‌లుగా కాంగ్రెస్ మద్దతుదారు చిట్టెం జ్యోతి, బీజేపీ బలపరిచిన పంది జ్యోతి, బీఆర్‌ఎస్‌కు చెందిన గుండు శ్రీదేవి బరిలో ఉన్నారు. ప్రధానంగా కాంగ్రెస్, బీజేపీ మద్దతుదారులైన చిట్టెం జ్యోతి, పంది జ్యోతి మధ్యే పోరు కొనసాగుతున్నట్లు తెలుస్తోంది. హస్తం మద్దతుతో బరిలో నిలిచిన చిట్టెం జ్యోతి మున్నూరు కాపు సామాజిక వర్గానికి చెందగా.. ఆమెను చిట్టెం రాఘవేందర్‌రెడ్డి వివాహమాడారు. ఈ క్రమంలో కాంగ్రెస్ బీసీలను మోసం చేస్తోందంటూ బీజేపీ ముమ్మర ప్రచారం నిర్వహించింది. తానూ ఈ గ్రామవాసినేనని.. బీసీ బిడ్డనేనని.. పదేళ్ల క్రితమే తమకు వివాహమైందంటూ చిట్టెం జ్యోతి విస్తృత ప్రచారం చేశారు. ఎక్కువ శాతం ఉన్న ముస్లింలు కాంగ్రెస్ వైపు నిలుస్తుండగా.. పద్మశాలి, కుర్వ, ఎస్సీలు బీజేపీకి మద్దతుగా ఉన్నట్లు తెలుస్తోంది. ఇరువురూ తమదే గెలుపు అని ధీమా వ్యక్తం చేస్తున్నారు.
ప్రభావిత వర్గాలు..
పద్మశాలి, ఎస్సీ, ముదిరాజ్, ముస్లిం, కుర్వ, గౌడ, బోయ వాల్మీకి, రెడ్డి
పురుషులు 4,034
మహిళలు 4,293
మొత్తం ఓటర్లు 8,327


