ప్రశాంత వాతావరణంలో ఎన్నికలు నిర్వహించాలి
అయిజ/మల్దకల్/రాజోళి: రెండో విడత పంచాయతీ ఎన్నికలు ప్రశాంత వాతావరణంలో నిర్వహించాలని, ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా భారీ బందోబస్తును ఏర్పాటు చేసినట్లు ఎస్పీ శ్రీనివాసరావు తెలిపారు. శనివారం అయిజ, మల్దకల్‌లో ఎన్నికల విధులకు హాజరయ్యే పోలీసులతో సమావేశమయ్యారు. ఓటింగ్ సమయంలో గుంపులుగా కేంద్రాల్లోకి అనుమతించవద్దని, పోలింగ్ కేంద్రం సమీపంలో దుకాణాలు మూసివేసేలా చర్యలు తీసుకోవాలన్నారు. పోలింగ్ బూత్‌లలో భద్రత, రూట్ ఇన్‌చార్జీ, రూట్ మొబైల్‌టీంలు, క్యూఆర్‌టీ, స్పెషల్ ఫోర్స్ బృందాలు చేపట్టాల్సిన పనులను స్పష్టంగా వివరించారు. ఎన్నికల ప్రవర్తన నియమావళిని ఉల్లంఘించిన వారిపై కఠినచర్యలు తీసుకోవడం జరుగుతుందన్నారు. అదే విధంగా అభ్యర్థులు, ఏజెంట్లు, రాజకీయ కార్యకర్తల ఒత్తిడులకు ప్రలోభాలకు లోనుకాకుండా పూర్తి నిష్పక్షపాతంగా విధులు నిర్వహించాలని సూచించారు. చిన్న గొడవలైనా నిర్లక్ష్యం చేయకుండా పరిష్కరించి శాంతిభద్రతలకు భంగం లేకుండా ప్రత్యేక చర్యలు చేపట్టాలన్నారు. ప్రజల భద్రతే మన ప్రధాన ధ్యేయమని, శాంతి భద్రతలకు విఘాతం కలిగించే ప్రయత్నాలను అణిచి వేయాలన్నారు. డీఎస్పీ మొగులయ్య, సీఐ టంగుటూరి శ్రీను, ఎస్‌ఐలు, సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.
కౌంటింగ్ పూర్తయ్యే వరకు అప్రమత్తంగా ఉండాలి
ఎన్నికల విధుల్లో ప్రతి ఒక్కరు బాధ్యతగా వ్యవహరించాలని, కౌంటింగ్ పూర్తయ్యే వరకు అప్రమత్తంగా ఉండాలని ఏఎస్పీ శంకర్ అన్నారు. రాజోళి, వడ్డేపల్లి మండలాల్లో శనివారం ఆయన పర్యటించారు. ఈ సందర్బంగా ఓటింగ్ మొదలుకుని కౌంటింగ్ ప్రక్రియ పూర్తి అయ్యే వరకు ఎలాంటి కార్యచరణను అమలు చేయాలనే అంశాలపై వడ్డేపల్లి, రాజోళి మండలాల పోలీస్ సిబ్బందికి అవగాహన కల్పించారు. పోలింగ్ కేంద్రాల వద్ద తనిఖీలు చేశాకే లోపలకు అనుమతించాలని సూచించారు.


