‘రెండో’ పోరుకు రెడీ
నేడు 2 విడత గ్రామపంచాయతీ ఎన్నికలు
● ఉమ్మడి జిల్లాలో 45 మంది సర్పంచ్‌లు, 1,004 వార్డు స్థానాలు ఏకగ్రీవం
● 520 జీపీలు.. 4,202 వార్డులకు పోలింగ్
● అన్ని ఏర్పాట్లు పూర్తి చేసిన అధికారులు
సాక్షి ప్రతినిధి, మహబూబ్‌నగర్: రెండో విడత పంచాయతీ పోరు తుది ఘట్టానికి చేరుకుంది. ఎన్నికల కమిషన్ షెడ్యూల్ ప్రకారం ఉమ్మడి పాలమూరులోని మహబూబ్‌నగర్, నాగర్‌కర్నూల్, నారాయణపేట, వనపర్తి జోగులాంబ గద్వాల జిల్లాల్లో 26 మండలాల పరిధిలో 565 గ్రామ పంచాయతీలు, 5,212 వార్డులకు ఆదివారం ఎన్నికలు జరగనున్నాయి. 45 జీపీలు ఏకగ్రీవం పోనూ 520 సర్పంచ్.. 1,004 ఏకగ్రీవం పోనూ 4,202 వార్డులకు పోలింగ్ నిర్వహించనున్నారు. ఈ మేరకు ఆయా జిల్లాల అధికారులు అన్ని ఏర్పాట్లు పూర్తి చేశారు. ఎన్నికల విధులు నిర్వర్తించనున్న ప్రభుత్వ సిబ్బందికి శనివారం పోలింగ్ సామగ్రిని అందజేశారు.
రెండో విడతలో ఇలా..
520 సర్పంచ్‌లకు
1,709 మంది పోటీ..
ఉమ్మడి జిల్లాలో పోలింగ్ జరగనున్న 520 జీపీల్లో 1,709 మంది అభ్యర్థులు సర్పంచ్‌లుగా పోటీపడుతున్నారు. సగటున ఒక్కో స్థానానికి ముగ్గురు బరిలో నిలిచినట్లు తెలుస్తోంది. అదేవిధంగా 4,202 వార్డు స్థానాలకు 10,826 మంది బరిలో నిలిచారు. ఈ లెక్కన ఒక్కో స్థానానికి సగటున అటుఇటుగా ముగ్గురు పోటీపడుతున్నట్లు స్పష్టమవుతోంది. సర్పంచ్ పదవులకు సంబంధించి ప్రధానంగా గద్వాల, మహబూబ్‌నగర్, వనపర్తిలో ఇద్దరికి మించి అభ్యర్థులు నువ్వా, నేనా అన్నట్లు ప్రచారంలో దూకుడుగా వ్యవహరించగా.. ఆయా జిల్లాల్లో పలితాలపై సర్వత్రా ఆసక్తి నెలకొంది.
‘రెండో’ పోరుకు రెడీ


