ప్రజా రక్షణ కోసమే సిబ్బందికి నైపుణ్య శిక్షణ
ఎర్రవల్లి: ప్రజల రక్షణ కోసమే 10వ బెటాలియన్ పోలీస్ సిబ్బందికి ప్రత్యేక నైపుణ్య శిక్షణకు అందిస్తున్నట్లు కమాండెంట్ జయరాజు తెలిపారు. విపత్తు సమయంలో వేగవంతమైన రక్షణ కోసం బీచుపల్లి పదో బెటాలియన్ సిబ్బందికి యూసుఫ్‌గూడలోని 1వ బెటాలియన్‌లో రాష్ట్ర విపత్తు ప్రతిస్పందనపై ప్రత్యేక శిక్షణ కొనసాగుతుందన్నారు. ఈ శిక్షణలో విపత్తులు సంభవించినప్పుడు, అనుకోని సంఘటనలు జరిగినప్పుడు ప్రాణ రక్షణకు ఉపయోగించే ఆధునిక పరికరాలపై ప్రత్యేక అవగాహన కల్పిస్తున్నట్లు తెలిపారు. ముఖ్యంగా ఎయిర్ లిఫ్టింగ్ బ్యాగ్, హైడ్రాలిక్ ర్యామ్ సెట్, ఫ్లోటింగ్ పంప్, ఇన్‌స్పెక్షన్ హోల్ మేకర్, రోటరీ రెస్క్యూ, కార్బైడ్ టిప్ చైన్స్, డైమండ్ టిప్ చైన్స్ పరికరాల వినియోగం, నిర్వహణ, విపత్తు సమయంలో రక్షణ చర్యలు తీసుకునే పద్ధతులపై ప్రాక్టికల్ శిక్షణను అందిస్తున్నట్లు తెలిపారు. ఈ శిక్షణ ద్వారా విపత్తుల సమయంలో ప్రజలను రక్షించడానికి, సత్వర చర్యలు చేపట్టడానికి, సిబ్బంది నైపుణ్యాలను మరింత మెరుగుపర్చడం ప్రధాన లక్ష్యమన్నారు. ప్రజలకు ఉపయోగపడే ఇటువంటి శిక్షణ కార్యక్రమాలు మరింత విస్తృతంగా కొనసాగాలని సూచించారు.


