పెద్దధన్వాడలో సంబరాలు
రాజోళి: ఇథనాల్ ఫ్యాక్టరీపై పెద్దధన్వాడ గ్రామస్తులు చేసిన ప్రజా పోరాటం ఫలించిందని పలువురు అన్నారు. పెద్దధన్వాడలో ఇథనాల్ ఫ్యాక్టరీ రద్దు కోసం గ్రామాల ప్రజలు చేసిన పోరాటం తెలిసిందే. ఈ క్రమంలో ఫ్యాక్టరీ గ్రామం నుండి ఇతర రాష్ట్రంలో ఏర్పాటు చేస్తున్నారని తెలియడంతో గురువారం గ్రామస్తులు సంబరాలు చేసుకున్నారు. కంపెనీ ప్రతినిధులు పెద్దధన్వాడ గ్రామాన్ని వీడి ఇతర రాష్ట్రంలో ఫ్యాక్టరీ ఏర్పాటు చేసుకునేందుకు దరఖాస్తు చేసుకున్నారని రైతులకు తెలియడంతో సంతోషం వ్యక్తం చేశారు. బాణా సంచా పేలుస్తూ, స్వీట్లు పంచుకున్నారు. గ్రామస్తులతోపాటు చుట్టు పక్కల గ్రామాల వారు ఇథనాల్ ఫ్యాక్టరీ వ్యతిరేక పోరాట కమిటీ పేరుతో చేసిన పోరాటం ఫలించిందని అన్నారు. ప్రజలు కలిసికట్టుగా కృషి చేస్తే ఏదైనా సాధ్యమవుతుందని నిరూపించారన్నారు. ఈ సందర్బంగా అంబేడ్కర్ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు.
వేరుశనగ క్వింటా రూ.7,500
గద్వాల వ్యవసాయం: గద్వాల మార్కెట్ యార్డుకు గురువారం 125 క్వింటాళ్ల వేరుశనగ వచ్చింది. గరిష్టం రూ.7500, కనిష్టం రూ.4830, సరాసరి రూ.6723 ధరలు లభించాయి. అలాగే, 8 క్వింటాళ్ల ఆముదాలు రాగా, గరిష్టం రూ.5980, కనిష్టం రూ.5420, సరాసరి రూ.5980 ధరలు పలికాయి. 743 క్వింటాళ్ల వరి (సోన) రాగా గరిష్టం రూ. 2716, కనిష్టం రూ. 1719, సరాసరి ధరలు రూ. 2546 వచ్చాయి.
27 వరకు ఓపెన్ డిగ్రీ
పరీక్ష ఫీజు చెల్లించాలి
కొల్లాపూర్: డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ ఓపెన్ యూనివర్సిటీలో సెమిస్టర్ పరీక్షల ఫీజు చెల్లింపునకు ఈ నెల 27 చివరి గడువు అని కొల్లాపూర్ ప్రభుత్వ డిగ్రీ కళాశాల ప్రిన్సిపల్ ఉదయ్‌కుమార్, ఓపెన్ డిగ్రీ సెంటర్ కోఆర్డినేటర్ రమేష్‌కుమార్ ఒక ప్రకటనలో వెల్లడించారు. 1, 3, 5 సెమిస్టర్ చదువుతున్న విధ్యార్థులు పరీక్ష ఫీజు ఆన్‌లైన్‌లో చెల్లించాలని సూచించారు. సెమిస్టర్ పరీక్షలు ఫిబ్రవరి నెలలో జరుగుతాయని పేర్కొన్నారు.


