ఏకగ్రీవ సర్పంచులకు ధ్రువీకరణ పత్రాలు
గద్వాలటౌన్: పంచాయతీ తొలిదశ ఎన్నికలలో పలు గ్రామాలు ఏకగ్రీవమయ్యాయి. తొలిదశ ఎన్నికలు జరిగే గద్వాల, గట్టు, కేటీదొడ్డి, ధరూరు మండలాల్లోని 106 గ్రామ పంచాయతీలకుగాను 15 గ్రామ పంచాయతీలు ఏకగ్రీవమయ్యాయి. గట్టు మండలంలో 6 గ్రామ పంచాయతీలు, కేటీదొడ్డి మండలంలో 2, ధరూరు మండలంలో 4, గద్వాల మండలంలో 3 గ్రామ పంచాయతీలలో సింగిల్ నామినేషన్ దాఖలు కావడంతో వాటిని అధికారులు ఏకగ్రీవమైనట్లు ప్రకటించారు. గురువారం ఏకగ్రీవమైన సర్పంచు అభ్యర్థులకు, వార్డు సభ్యులకు అధికారులు ధ్రువీకరణ పత్రాలు అందజేశారు. తరువాత ఉప సర్పంచ్ ఎన్నిక సైతం చేపట్టారు. మెజార్టీ వార్డు సభ్యుల అభిప్రాయం మేరకు ఉప సర్పంచులను ఎన్నుకున్నారు. సర్పంచ్, ఉప సర్పంచ్ ఎన్నిక పూర్తయిన వెంటనే ఆయా గ్రామాలలో సంబురాలు నిర్వహించారు. గెలుపొందిన వారికి మిఠాయిలు తినిపించి, పెద్ద ఎత్తున్న సన్మాన కార్యక్రమాలు చేపట్టారు. ఏకగ్రీవ గ్రామాలలో కోలాహాలం నెలకొంది.


