ఉన్నత లక్ష్యంతో చదివితే ఉజ్వల భవిష్యత్
గట్టు: పోటీ ప్రపంచంలో రాణించేందుకు ప్రతి విద్యార్థి ఉన్నత లక్ష్యంతో చదువుకోవాలని జిల్లా ఉపాధి కల్పన అధికారి డా.ప్రియాంక సూచించారు. కలెక్టర్ బీఎం సంతోష్ ఆదేశాల మేరకు మంగళవారం మాచర్ల, ఇందువాసి పాఠశాలల్లో 9, 10 తరగతుల విద్యార్థులకు ప్రేరణ తరగతులు నిర్వహించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. విద్యార్థులు క్రమం తప్పకుండా పాఠశాలకు హాజరై ఉపాధ్యాయులు చెప్పే పాఠ్యాంశాలను శ్రద్ధగా విని అర్థం చేసుకోవాలన్నారు. ప్రతి పాఠాన్ని కేవలం సబ్జెక్టుగా చూడకుండా.. తమ భవిష్యత్‌ను మార్చే గొప్ప అవకాశంగా భావించాలని సూచించారు. ఉపాధ్యాయులు చెప్పబోయే పాఠాన్ని ఒక రోజు ముందుగానే విద్యార్థులు ఇంటి వద్ద చదువుకుని వస్తే మరింత సులభంగా అర్థమవుతుందని తెలిపా రు. శారీరకంగా, మానసికంగా ఉల్లాసంగా ఉండేందుకు నిత్యం వ్యాయామం చేయాలని సూచించా రు. సాంస్కృతిక కార్యక్రమాలకు కొంత సమయం కేటాయించాలని తెలిపారు. కార్యక్రమంలో హెచ్ ఎంలు, ఉపాధ్యాయులు పాల్గొన్నారు.


