దళారులను నమ్మి మోసపోవద్దు
అలంపూర్ రూరల్: రైతులు కష్టించి పండించిన పంటను దళారులకు విక్రయించి మోసపోవద్దని ఎమ్మెల్యే విజయుడు అన్నారు. మంగళవారం అలంపూర్ మండలం క్యాతూర్‌లో మొక్కజొన్న కొనుగోలు కేంద్రాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ.. ప్రభుత్వం మార్క్‌ఫెడ్ ఆధ్వర్యంలో ఏర్పాటుచేసిన మొక్కజొన్న కొనుగోలు కేంద్రాలను రైతులు సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. క్వింటాల్‌కు రూ. 2,400 మద్దతు ధర చెల్లిస్తుందని.. తేమ 14శాతంలోపు ఉండాలని.. ఎకరాకు 25 క్వింటాళ్ల వరకు కొనుగోలు చేస్తున్నట్లు మార్క్‌ఫెడ్ డీఎం చంద్రమౌళి వివరించారు. కార్యక్రమంలో మార్కెట్ కమిటీ చైర్మన్ దొడ్డెప్ప, వైస్ చైర్మన్ కుమార్, ఏఓ నాగార్జున్‌రెడ్డి, క్యాతూర్ పీఎసీఎస్ ఆధ్యక్షుడు రాఘవరెడ్డి, సీఈఓ హుస్సేన్ పీరా పాల్గొన్నారు.


