ఇసుక దొంగలు | - | Sakshi
Sakshi News home page

ఇసుక దొంగలు

Nov 4 2025 7:08 AM | Updated on Nov 4 2025 7:08 AM

ఇసుక

ఇసుక దొంగలు

డంపులు ఏర్పాటు..

అధికారుల సీజ్‌

నదిలో ఎగువ నుంచి వచ్చే నీరు తగ్గుముఖం పట్టగానే ఇసుకాసురులు తమ దందాకు తెరలేపుతున్నారు. వీలైతే నేరుగా ట్రాక్టర్లు, లేదంటే ఎద్దుల బండ్ల ద్వారా నదిలో నుండి ఇసుకను తీసుకువచ్చి రహస్య ప్రదేశాల్లో డంపులు పోసుకుంటున్నారు. అదును చూసి దాన్ని అమ్ముకుంటున్నారు. ఈ క్రమంలోనే గత వారంలో మాన్‌దొడ్డిలో అక్రమంగా ఏర్పాటు చేసిన 60 ట్రాక్టర్లపైగా ఇసుకను రెవెన్యూ అధికారులు గుర్తించి సీజ్‌ చేశారు. ఒక్క మాన్‌దొడ్డిలోనే కాక, రాజోళిలో కూడా డంపులు పెద్ద మొత్తంలో పోసి ఉంచారు. ప్రభుత్వం కేటాయించిన రీచ్‌ నుంచి రవాణా లేకపోవడంతో అక్రమ దందా యధేచ్ఛగా కొనసాగుతుంది. చెంతనే నదులు,వాగులు,వనరులు ఉన్నా, మా ప్రాంతంలోని, మా గ్రామంలోని ఇసుకను కూడా మేము ఎక్కువ ధరకు కొనాల్సి వస్తుందని, ప్రభుత్వం మాత్రం ఉచితంగా ఇసుకను అందిస్తామని చెబుతుందని, అది మాటలకే పరిమితవుతుందని అంటున్నారు. ఇకనైనా నామమాత్రపు చార్జీలకు ఇసుకను అందివ్వాలని ప్రజలు కోరుతున్నారు.

రాజోళి: ఇందిరమ్మ ఇంటి లబ్ధిదారుల ఇసుక అవసరాలను ఆసరాగా తీసుకుని అక్రమార్కులు రెచ్చిపోతున్నారు. ఇందిరమ్మ ఇళ్ల కోసం తుంగభద్ర నది నుంచి కేటాయించిన రీచుల దగ్గర నుంచి ఇసుక రవాణా నిలవడంతో ఇదే అదునుగా ఇసుకాసురులు అధిక ధరలకు ఇసుకను విక్రయిస్తూ కాసులు పోగేసుకుంటున్నారు. విధిలేని పరిస్థితుల్లో ఇందిరమ్మ ఇంటి లబ్ధిదారులు అధిక ధరలకు ఇసుక కొనే దుస్థితి నెలకొంది.

కేటాయించిన ఇసుక నిలవడంతో..

జిల్లాలోని ఇందిరమ్మ ఇళ్లను నిర్మించేందుకు మండలంలోని తుమ్మిళ్ల గ్రామం వద్ద ప్రభుత్వ ఇసుక రీచ్‌ ఏర్పాటు చేసింది. కానీ కొన్ని కారణాల చేత అక్కడ నుంచి ఇసుక రవాణా కొనసాగకపోవడంతో కొందరు అక్రమార్కులు ఇసుక దందాకు తెరలేపారు. తుంగభద్ర నదిలో నీరు తగ్గిన సమయంలో ఎడ్ల బండ్లతో ఇసుకను ఒడ్డుకు చేర్చి డంపులు పోసుకుని, రాత్రికి రాత్రి ఇసుకను బయటకు తరలిస్తున్నారు. రాజోళి, మాన్‌దొడ్డి తదిదర నదీ తీర గ్రామాల నుంచి ఇసుక ట్రాక్టర్లు, మినీ టిప్పర్లు రాత్రి సమయంలో జోరుగా దందా కొనసాగిస్తున్నాయి. దూరాన్ని బట్టి ఒక్క ట్రాక్టర్‌ కు రూ.6వేల దాకా వసూలు చేస్తున్నారు. ఒక్క రాజోళి మండలాన్ని పరిశీలిస్తే.. మొదటి విడతలో మొత్తం 269 ఇందిరమ్మ ఇళ్లు మంజూరు కాగా అందులో 178 ఇళ్లకు మార్కవుట్‌ పూర్తి చేశారు. అందులో 111 ఇళ్లు బేస్‌మెంట్‌ లెవెల్‌ పూర్తి చేసుకున్నాయి. మిగిలిన 67 ఇళ్లు నిర్మాణాలు పూర్తి కాలేదు. కాగా అందులో ఏ స్థాయిలో ఉన్న ఇంటికై నా ఇసుక అవసరం తప్పనిసరి. అందులో చాలా వరకు ప్రభుత్వం కేటాయించిన రీచ్‌ నుంచి ఇసుక రావాల్సి ఉండగా..అప్పుడు కూడా సమయానికి రాకపోవడంతో, అక్రమంగా దందా చేస్తున్న వారి నుండి లబ్ధిదారులను కొనాల్సి వచ్చింది. ప్రస్తుతం దశల వారీగా నిర్మాణం పూర్తి చేసుకుంటున్న క్రమంలో, ఇసుక లేదని నిర్మాణం నిలిపితే బిల్లు వస్తుందో రాదోనన్న ఆందోళన నెలకొంది. దీంతో లబ్ధిదారుల అవసరాన్ని ఆసరాగా తీసుకుని రాత్రికి రాత్రే ఇసుక అక్రమ రవాణాను జోరుగా సాగించేస్తున్నారు.

ఇందిరమ్మ ఇళ్లకు ఇసుక రవాణా నిలవడంతో అక్రమ దందాకు తెర

తుంగభద్రలో నీరు తగ్గితే నదిలో మాఫియా ఆగడాలు

రాత్రికి రాత్రే వెలుస్తున్న డంపులు

ఇందిరమ్మ లబ్ధిదారులకు అధిక ధరలకు విక్రయం

అధిక ధరకు విక్రయిస్తే చర్యలు

మాన్‌దొడ్డిలో ఇసుక డంపులు ఉన్నాయనే సమాచారం రావడంతో రెవెన్యూ అధికారుల సమక్షంలో దాడులు నిర్వహించి డంపు పోసిన ఇసుకను సీజ్‌ చేశాం. లబ్ధిదారులకు అధిక ధరలకు విక్రయిస్తే అలాంటి వారి గురుంచి మాకు సమాచారం ఇస్తే తప్పకుండా వారిపై చర్యలు తీసుకుంటాం. నదీ తీర గ్రామాల్లో ఇసుక దందా, అక్రమ రవాణా చేసే వారిపై కూడా కేసులు తప్పవు. – పి.రామ్మోహన్‌, తహసీల్దార్‌ రాజోళి

ఇసుక దొంగలు 1
1/1

ఇసుక దొంగలు

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement