నిర్దేశిత లక్ష్యాన్ని చేరుకోవాలి
● కేంద్ర గ్రామీణాభివృద్ధి శాఖ ఉప కార్యదర్శి అలుగు వర్షిణి
● గట్టులో ఆస్పిరేషన్ బ్లాక్‌పై అధికారులతో సమీక్ష
గట్టు: వివిధ రంగాల్లో నిర్దేశిత లక్ష్యాలను చేరుకునేందుకు అన్ని శాఖల అధికారులు సమన్వయంతో పని చేస్తూ, లక్ష్యాన్ని చేరుకోవాలని జిల్లా ప్రభారి అధికారి, కేంద్ర గ్రామీణ అభివృద్ధి శాఖ ఉప కార్యదర్శి అలుగు వర్షిణి అధికారులకు సూచించారు. సోమవారం గట్టులో వివిధ శాఖల అధికారులతో ఆస్పిరేషన్ బ్లాక్ ప్రోగ్రామ్‌పై సమీక్షను నిర్వహించారు. నీతి అయోగ్ ఆధ్వర్యంలో అమలవుతున్న ఆస్పిరేషన్ బ్లాక్ ప్రోగ్రామ్‌కు గట్టు మండలం ఎంపికై న విషయం తెలిసిందే. గట్టు ఆస్పిరేషన్ బ్లాక్ జిల్లా అధికారిగా వ్యవహరిస్తున్న అలుగు వర్షిణి వివిధ శాఖల్లోని అభివృద్ధి సూచికలపై సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. విద్య, ఆరోగ్యం, పోషణ, మౌలిక వసతులు, వ్యవసాయం తదితర కీలక రంగాల్లో చెప్పుకోదగ్గ పురోగతి సాధించడమే లక్ష్యంగా కార్యక్రమాన్ని అమలు చేస్తున్నట్లు తెలిపారు. ఏబీపీలోని 39 అంశాలు కీలక పనితీరు సూచీలుగా పేర్కొనడం జరుగుతుందని తెలిపారు. జిల్లా స్థాయి సంబంధిత శాఖల అధికారులు ప్రతి సూచీలో సాధించిన పురోగతిపై సమగ్ర నివేదికను సమర్పించాలని ఆదేశించారు.
పౌష్టికాహారం సక్రమంగా అందించాలి
అంగన్‌వాడీ కేంద్రాల ద్వారా లబ్ధిదారులకు సక్రమంగా పౌష్టికాహారాన్ని అందించాలని ఆమె ఐసీడీఎస్ అధికారులను ఆదేశించారు. ఈమేరకు నల్లగట్టు తండాలోని అంగన్‌వాడీ కేంద్రాన్ని తనిఖీ చేశారు. అక్కడి చిన్నారులు, గర్భిణులు, బాలింతలతో మాట్లాడారు. రికార్డులను పరిశీలించారు. కార్యక్రమంలో జిల్లా ఇన్‌చార్జ్ విద్యాధికారి విజయలక్ష్మీ, చేనేత జౌళిశాఖ అధికారి గోవిందయ్య, తహసీల్దార్ విజయ్‌కుమార్, ఎంపీడీఓ చెన్నయ్య, ఇతర అధికారులు పాల్గొన్నారు.


