రోడ్డెక్కిన పత్తి రైతు
● సీసీఐ నిబంధనలు సడలించాలని ఆందోళన
● ఎకరాకి 7 క్వింటాళ్ల నిబంధనతో తీవ్ర నష్టం
● 12 క్వింటాళ్లు కొనుగోలు చేయాల్సిందేనని డిమాండ్
● జాతీయ రహదారి దిగ్బంధం.. కిలోమీటర్ మేర ట్రాఫిక్ జామ్
ఉండవెల్లి: ఎకరాకు 7 క్వింటాళ్ల పత్తి మాత్రమే కొనుగోలు చేస్తామని చెప్పడం సమంజసం కాదని.. మొన్నటి వరకు 12 క్వింటాళ్లు కొనుగోలు చేసి ఇప్పుడు సీసీఐ కొత్త నిబంధనలతో తీవ్రంగా నష్టపోతామని పత్తి రైతులు జాతీయ రహదారిపైకి ఎక్కి ఆందోళనకు దిగారు. ఉండవెల్లి శివారులోని సీసీఐ కేంద్రానికి శనివారం, ఆదివారం సెలవు కావడంతో సోమవారం రైతులు భారీగా పత్తిని వాహనాల్లో తీసుకువచ్చారు. అప్పటికే స్లాట్ బుక్ చేసుకొని రాగా.. సీసీఐ కేంద్రంలో మాత్రం ఎకరాకి 7 క్వింటాళ్ల పత్తి మాత్రమే కొనుగోలు చేస్తామని చెప్పడంతో రైతులందరూ ఆగ్రహం వ్యక్తం చేశారు. నిబంధనలు ఎలా మారుస్తారంటూ ప్రశ్నించారు. అనంతరం పత్తి వాహనాలతో జాతీయ రహదారికి చేరుకొని ధర్నాకు దిగారు. రెండు వైపులా రోడ్డును బంద్ చేయడంతో కిలో మీటర్ మేర ట్రాఫిక్‌జామ్ అయ్యింది.
పంట విక్రయించాలంటే ఇబ్బందులే..
ఈ ఆందోళనలో రాష్ట్ర వాల్మీకి సంఘం అధ్యక్షుడు రేపల్లె కృష్ణ, పలువురు మాట్లాడుతూ.. పంట కోసం భూమిని చదును చేసే నాటి నుంచి విత్తనాలు విత్తి పంట చేతికొచ్చేంత వరకు రేయింబవళ్లు రైతులు ఎంతో కష్టపడతారని, చివరికి పంట విక్రయానికి సైతం ఇబ్బందులు తప్పట్లేదన్నారు. అసలే ఈ సీజన్‌లో భారీ వర్షాలు, మోంథా తుపాన్‌తో పంట దిగుబడిపై తీవ్ర ప్రభావం చూపిందని, వందల ఎకరాల్లో పంట నష్టపోయారని, ఇన్ని కష్టాలు దాటుకొని వచ్చిన పంటను విక్రయానికి తీసుకొస్తే సీసీఐ సిబ్బంది కొర్రీలు పెట్టడం ఎంత వరకు సమంజసమని ప్రశ్నించారు. ఎకరాకి 12 క్వింటాళ్లు కొనుగోలు చేయాలని, కేంద్రం మద్దతు ధర ఇవ్వాలని డిమాండ్ చేశారు.
రోడ్డెక్కిన పత్తి రైతు


