తుపాన్ బాధిత రైతులను ఆదుకోవాలి
అలంపూర్: మోంథా తుపాను బాధిత రైతులను ప్రభుత్వం ఆదుకోవాలని, ప్రజా సమస్యల పరిష్కారంలో సర్కారు విఫలమైందని సీపీఎం రాష్ట్ర కమిటీ సభ్యుడు శ్రీరామ్ నాయక్ అన్నారు. అలంపూర్ చౌరస్తాలో సీపీఎం జిల్లా కమిటీ సమావేశం జిల్లా కమిటీ సభ్యుడు మద్దిలేటి అధ్యక్షతన సోమవారం జరిగింది. ఈ సందర్భంగా శ్రీరామ్‌నాయక్ మాట్లాడుతూ.. సీసీఐ నిబంధనల ప్రకారం పత్తిని కొనుగోలు చేయాలని, సీ రిజర్వేషన్లపై కేంద్ర ప్రభుత్వం అనుసరిస్తున్న నిర్లక్ష్య వైఖరిని ప్రజలు ముక్త కంఠంతో వ్యతిరేకించాలని పిలుపునిచ్చారు. కేంద్ర ప్రభుత్వం నిర్లక్ష్యంతోనే స్థానిక సంస్థల ఎన్నికలు సరైన సమయంలో జరగడం లేదని, దీంతో రాష్ట్రానికి రావాల్సిన రూ.3వేల కోట్ల నిధులు సైతం విడుదల చేయడం లేదన్నారు. బీసీ రిజర్వేషన్లపై దాటవేత వైఖరితో ఉన్న కేంద్రం బీహార్‌లో ఓట్ల చోరీకి పాల్పడుతూ ప్రజాస్వామ్యాని ఖూనీ చేస్తుందని విమర్శించారు. రాష్ట్ర ప్రభుత్వం ఇందిరమ్మ ఇళ్లు నిర్మించుకున్న లబ్ధిదారులకు నగదు ఇవ్వడం లేదని, వృద్ధ్యాప్య, వితంతు, దివ్యాంగుల పెన్షన్‌ల ఊసే లేదన్నారు. గతేడాది వరికి చెల్లించాల్సిన బోనస్ పెండింగ్‌లోనే ఉంచిందన్నారు. అనంతరం జిల్లా కార్యదర్శి వెంకటస్వామి మాట్లాడుతూ... సాంఘిక సంక్షేమ గురుకులాలు, వసతి గృహాలు, ప్రభుత్వ పాఠశాలల్లో తరచు ఫుడ్ పాయిజన్ జరుగుతున్న అధికార యంత్రాంగం దృష్టిసారించడం లేదన్నారు. అలంపూర్ చౌరస్తా, ఎర్రవల్లి చౌరస్తా వంటి ప్రధాన రహదారుల్లో బస్టాండ్లు నిర్మించాలన్నారు. అనంతరం అలంపూర్ చౌరస్తా సమీపంలోని సీసీఐ కొనుగోళు కేంద్రాన్ని సందర్శించారు.రాజు, వివి నరసింహ, పరంజ్యోతి, ఉప్పేర్ నరసింహ, ఈదన్న, రమేష్ పాల్గొన్నారు.


