‘ఉపాధి’కి కసరత్తు
● గ్రామసభల్లో చర్చ.. తీర్మానాలు
● నీటి సంరక్షణ పనులకు ప్రాధాన్యత
2026 –27లో చేపట్టాల్సిన పనులు క్షేత్ర స్థాయిలో గుర్తింపు
ప్రతి కూలీకి పని కల్పిస్తున్నాం
జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం కింద ప్రతి కూలీకి పని కల్పించే విధంగా చర్యలు తీసుకుంటున్నాము. వచ్చే ఆర్థిక సంవత్సంలో చేపట్టాల్సిన పనులు గుర్తింపు జిల్లాలో కొనసాగుతోంది. నీటి సంరక్షణ ఇతర శాశ్వత పనులకు ఎక్కువ ప్రాధాన్యత ఇస్తున్నాం. పారదర్శకంగా పనులను గుర్తించి తీర్మానాలు చేస్తున్నాము.
– నర్సింగరావ్, అడిషనల్ కలెక్టర్
గద్వాల న్యూటౌన్: జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం కింద రానున్న (2026–27) ఆర్థిక సంవత్సరంలో చేపట్టాల్సిన పనుల గుర్తింపు ప్రారంభం అయ్యింది. గడిచిన వారం రోజుల నుంచి సిబ్బంది చేపట్టాల్సిన పనులను క్షేత్రస్థాయిలో గుర్తిస్తున్నారు. ఇలా గుర్తించిన పనుల వివరాలను గ్రామసభల్లో చర్చిచడంతో పాటు తీర్మానాలు చేస్తున్నారు. నీటి సంరక్షణ పనులకు ఎక్కువ ప్రాదాన్యత ఇస్తూ.. గ్రామీణ ప్రాంతాల్లో వలసలు నిరోధించేలా పనిదినాలను నిర్ణయిస్తున్నారు.
శాశ్వత పనులకు ప్రాధాన్యం
ఉపాధిహామీ పథకం కింద 2026–27 ఆర్థిక సంవత్సరంలో చేపట్టాల్సిన పనులను అధికారులు క్షేత్రస్థాయిలో సిబ్బంది చేత ప్రత్యేకంగా గుర్తిస్తున్నారు. గడిచిన అక్టోబర్ 2వ తేదీ నుంచి ఈ ప్రక్రియ జిల్లాలో ఆరంభం అయ్యింది. నవంబర్ 30వ తేదీ వరకు ఈ కార్యక్రమం ఉండనుంది. నిర్దేశించిన తేదీల్లో ఆయా గ్రామాల్లో ఒక రోజు ముందు ఉపాధి హమీ పథకం కింద ఏఏ పనులు చేపట్టాల్సి ఉన్నాయో తెలియజేయాలని రైతులు, కూలీలు, ప్రజలకు సూచిస్తున్నారు. వారు సూచించిన స్థలాలను ఉపాధి సిబ్బంది క్షేత్ర స్థాయికి వెళ్లి పరిశీలిస్తున్నారు. దాదాపు ఒక్కో గ్రామంలో మూడు నుంచి నాలుగు రోజుల పాటు పనుల గుర్తింపు, పరిశీలనకు సమయం తీసుకుంటున్నారు. గుర్తించిన అనంతరం గ్రామాల వారీగా ప్రణాళికను తయారు చేస్తున్నారు. శాశ్వత పనులకు ఎక్కువగా ప్రాధాన్యత ఇస్తున్నట్లు సంబంధిత అధికారులు అంటున్నారు. ప్రధానంగా నీటి సంరక్షణ పనులు (ఫాంపాండ్స్, వాలుకట్టలు) ప్రాధాన్యత కల్పించారు. ఇంకా ఇంకుడు గుంతలు, వ్యవసాయ పొలాల చదును, కంపోస్ట్ పిట్‌లు, నాడేక్ కంపోస్ట్ పిట్‌లు, పండ్లతోటలు, పశువుల పాకాలు, గొర్రెల షెడ్లు, కోళ్ల షెడ్లు, పాఠశాలల్లో టాయిలెట్లు, నర్సరీలు, వంటగదులు తదితర పనులు ఉండనున్నాయి.
పనులకు వస్తున్న
కూలీల సంఖ్య:
1,49,187
‘ఉపాధి’కి కసరత్తు
‘ఉపాధి’కి కసరత్తు


