వసతి గృహంలో కొనసాగిన వైద్య శిబిరం
ఎర్రవల్లి: మండలంలోని ధర్మవరం బీసీ బాలుర వసతి గృహంలో జరిగిన ఫుడ్ పాయిజన్ నేపఽథ్యంలో వైద్య శిబిరాన్ని రెండవ రోజైన ఆదివారం సైతం కొనసాగించారు. రాష్ట్రీయ బాల స్వస్థ్య కార్యక్రమం వైద్యులు ఇందిర, అమూల్య వసతి గృహంలోని విద్యార్థులకు వైద్య పరీక్షలు నిర్వహించి అవసరమైన మందులను పంపిణీ చేశారు. అనంతరం వైద్యులు మాట్లాడుతూ విద్యార్థులు సరైన వ్యక్తిగత పరిశుభ్రతను పాటించాలన్నారు. ఆరోగ్యకరమైన సమతూల్య ఆహారం తీసుకొని క్రమం తప్పకుండా వ్యాయామం చేయాలన్నారు. ఏదైనా అనారోగ్య లక్షణాలు కనిపిస్తే నిర్లక్ష్యం చేయకుండా వైద్యులను సంప్రదించాలని సూచించారు. ప్రస్తుతం విద్యార్థుల ఆరోగ్య పరిస్థతి అంతా నిలకడగా ఉన్నట్లు వారు పేర్కొన్నారు. కార్యక్రమంలో పార్మసిస్ట్ మస్రత్, సాఫియా, ఏఎన్‌ఎం భారతమ్మ, పద్మ, ఆశాలు ఉన్నారు. ఇదిలాఉండగా, ధర్మవరం వసతి గృహ ంలో గత నెల 31న రాత్రి భోజనం చేశాక దాదాపు 55 మంది విద్యార్థులకు వాంతులు, విరేచనాలతో అస్వస్థతకు గురి కాగా.. చికిత్స నిమిత్తం వారిని జిల్లా ఆస్పత్రికి తరలించారు.


