పెండింగ్ బిల్లులు, పీఆర్సీ సాధనకు ఉద్యమించాలి
గద్వాలటౌన్: ఐక్య పోరాటాల ద్వారానే ఉపాధ్యాయుల సమస్యలు పరిష్కారం అవుతాయని, పెండింగ్ బిల్లులు, పీఆర్సీ సాధనకు ఉద్యమించాలని ఎస్‌టీయూ రాష్ట్ర పూర్వ అధ్యక్షుడు పర్వతరెడ్డి పిలుపునిచ్చారు. ఆదివారం స్థానిక ప్రభుత్వ అభ్యసన ఉన్నత పాఠశాలలో ఏర్పాటు చేసిన ఎస్‌టీయూ జిల్లా కౌన్సిల్ సమావేశానికి ఆయన ముఖ్య అతిథిగా హాజరై మాట్లాడారు. ఏకీకృత సర్వీస్ రూల్స్ సాధనే లక్ష్యంగా ఉపాధ్యాయులు కలిసి పోరాడాలని సూచించారు. అప్పుడే ఎంఈఓ, జేఎల్, డిప్యూటి డీఈఓల పదోన్నతులకు మార్గం ఏర్పడుతుందన్నారు. పెండింగ్‌లో ఉన్న అయిదు డీఏలను తక్షణమే విడుదల చేయాలని డిమాండ్ చేశారు. ఉపయోగపడని శిక్షణలతో ఉపాధ్యాయుల బోధనకు ఆటంకం కలిగించవద్దని సూచించారు. హెల్త్ కార్డు ఉత్తర్వులను విడుదల చేయాలని కోరారు. జీవో 317 ద్వారా నష్టపోయిన ఉపాధ్యాయులకు న్యాయం చేసి, స్వంత జిల్లాకు పంపాలని డిమాండ్ చేశారు. అనంతరం ఎస్‌టీయూ జిల్లా నూతన కార్యవర్గాన్ని ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. ఎస్‌టీయూ జిల్లా అధ్యక్షుడిగా పులిపాటి లక్ష్మణ్, ప్రధాన కార్యదర్శిగా యూనుస్‌పాషా, ఆర్థిక కార్యదర్శిగా విజయభాస్కర్, అడిషినల్ జనరల్ కార్యదర్శులుగా శ్రీహరి, ఇస్మాయిల్, అసోసియేట్ అధ్యక్షులుగా కృష్ణయ్య, అమరేష్‌బాబు తదితరులను ఎన్నికయ్యారు.


