జాతీయ వాలీబాల్ టోర్నీకి జిల్లా క్రీడాకారుడు
గద్వాలటౌన్: మధ్యప్రదేశ్‌లో వచ్చేనెల 24 నుంచి 26వ తేదీ వరకు జరిగే జాతీయ స్థాయి వాలీబాల్ పోటీలకు గద్వాల గురుకుల పాఠశాల విద్యార్థి రాత్లావత్ సిద్దు రాథోడ్ ఎంపికయ్యారు. గురుకుల కళాశాలలో ఇంటర్ ద్వితీయ సంవత్సరం చదువుతున్న సిద్దు.. ఇటీవల మహబూబ్‌నగర్‌లో జరిగిన ఎస్‌జీఎఫ్–19 రాష్ట్రస్థాయి బాలుర వాలీబాల్ పోటీల్లో జిల్లా జట్టు తరఫున పాల్గొని అత్యుత్తమ ప్రతిభ చాటడంతో జాతీయస్థాయి పోటీలకు ఎంపిక చేశారు. ఈ సందర్భంగా మంగళవారం పాఠశాలలో సిద్దు రాథోడ్‌ను ప్రిన్సిపాల్ రాజు శాలువాతో సత్కరించి అభినందనలు తెలిపారు. జాతీయస్థాయి పోటీల్లో సత్తా చాటాలని సూచించారు. కార్యక్రమంలో ఉపాధ్యాయులు పాల్గొన్నారు.


