తుపాన్‌తో నష్టం వాటిల్లకుండా చూడాలి
గద్వాల: మోంథా తుపాన్ కారణంగా ఎలాంటి ప్రాణ, ఆస్తినష్టం జరగకుండా ముందుజాగ్రత్త చర్యలు చేపట్టాలని కలెక్టర్ బీఎం సంతోష్ అధికారులను ఆదేశించారు. మంగళవారం కలెక్టరేట్‌లో ఏర్పాటుచేసిన సమావేశంలో ఆయన మాట్లాడారు. రైతులు ఆరబెట్టిన ధాన్యం వర్షానికి తడిసి నష్టపోకుండా టార్పాలిన్లు అందుబాటులో ఉంచాలన్నారు. తుఫాన్ ప్రభావం గురించి రైతులకు ఎప్పటికప్పుడు తెలియజేస్తూ అప్రమత్తం చేయాలని కలెక్టర్ సూచించారు. రానున్న మూడు రోజులపాటు అవసరమైతే వరికోతలు జరపకుండా రైతులకు క్షేత్రస్థాయిలో అవగాహన కల్పించాలన్నారు. వరిధాన్యం, పత్తి, మొక్కజొన్న కొనుగోళ్ల నేపథ్యంలో వర్షానికి ధాన్యం తడిసి నష్టం వాటిల్లకుండా చర్యలు చేపట్టాలన్నారు.
● ఈవీఎంలు భద్రపర్చిన స్ట్రాంగ్‌రూం వద్ద పటిష్ట భద్రతా ఏర్పాటు చేసినట్లు కలెక్టర్ బీఎం సంతోష్ అన్నారు. జిల్లా కేంద్రంలోని కలెక్టరేట్ ఆవరణలో ఈవీఎంల గోదాంను అధికారులతో కలిసి ఆయన పరిశీలించారు. ఎన్నికల సంఘం ఆదేశాల మేరకు తనిఖీలు నిర్వహిస్తున్నట్లు తెలిపారు. అదే విధంగా స్ట్రాంగ్‌రూంలో సీసీ కెమెరాల పనితీరును పరిశీలించారు. కలెక్టర్ వెంట ఎన్నికల విభాగం సూపరింటెండెంట్ కరుణాకర్ ఉన్నారు.


