శాంతి భద్రతలకు విఘాతం కలిగిస్తే చర్యలు
గద్వాల క్రైం: జిల్లాలో శాంతి భద్రతలకు విఘాతం కలిగిస్తే కఠిన చర్యలు తీసుకుంటామని ఎస్పీ శ్రీనివాసరావు హెచ్చరించారు. మంగళవారం ఎస్పీ కార్యాలయంలో పోలీసు అధికారులతో సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. శాంతి భద్రతల విషయంలో అప్రమత్తంగా ఉంటూ, అనుమానాస్పద కేసుల విచారణ వేగంగా చేపట్టాలన్నారు. రోడ్డు ప్రమాదాల నివారణ కోసం విలేజ్ రోడ్డు సేఫ్టీ కమిటీలను ఏర్పాటు చేయాలని ఆదేశించారు. హిట్ అండ్ రన్ కేసులపై ప్రత్యేకంగా విచారణ చేపట్టాలన్నారు. ఇసుక, మట్టి, రేషన్ బియ్యం అక్రమ రవాణా జరగకుండా పకడ్బందీ చర్యలు తీసుకోవాలన్నారు. నిషేధిత మత్తు పదార్థాలు, గంజాయి, పేకాట వంటి వాటిని కట్టడి చేయాలని సూచించారు. సరిహద్దు ప్రాంతాల్లో పటిష్ట నిఘా ఉంచాలన్నారు. పోలీస్‌స్టేషన్‌లో నమోదైన కేసుల విషయంలో నిర్లక్ష్యం లేకుండా వీలైనంత త్వరగా కోర్టులో చార్జీషీట్ దాఖలు చేసి.. నిందితులకు శిక్ష పడేలా చూడాలన్నారు. గ్రామాల్లో అల్లర్లకు పాల్పడే వారిపై కఠినంగా వ్యవహరించాలని సూచించారు. సైబర్ నేరగాళ్ల బారినపడకుండా తీసుకోవాల్సిన జాగ్రత్తలపై ప్రజలకు అవగాహన కల్పించాలన్నారు. సమావేశంలో డీఎస్పీ మొగిలయ్య, సీఐ టాటాబాబు, శ్రీను, రవిబాబు, ఎస్‌ఐలు కళ్యాణ్ కుమార్, శేఖర్, రాజునాయక్, శ్రీనివాసులు, మల్లేష్, శ్రీహరి, నందికర్ తదితరులు ఉన్నారు.


