తడి.. పొడి ఊసేది?
గద్వాల పురపాలికలో గాడితప్పిన చెత్త నిర్వహణ
● కానరాని తడి, పొడి వేరుచేసే ప్రక్రియ
● చొరవ చూపని మున్సిపల్ అధికారులు
● నెరవేరని ప్రభుత్వ లక్ష్యం
ప్లాస్టిక్ డబ్బాలు అందజేయాలి..
తడి, పొడి చెత్త వేరు చేయడానికి నాలుగేళ్ల క్రితం ఇంటింటికీ రెండు ప్లాస్టిక్ డబ్బాలు ఇచ్చారు. ప్రస్తుతం అవి చాలా వరకు పాడయ్యాయి. చాలా ఇళ్లలో ప్లాస్టిక్ డబ్బాలు లేకపోవడం వల్ల తడి, పొడి చెత్త కలిపే ఇస్తున్నారు. దీంతో లక్ష్యం నెరవేరడం లేదు. తడి, పొడి చెత్త వేరుగా ఇవ్వడానికి ఇంటింటికీ ప్లాస్టిక్ డబ్బాలు పంపిణీ చేయాలి.
– శ్రీధర్, గద్వాల
అవగాహన కల్పిస్తాం..
కాలనీల్లో తడి, పొడి చెత్త సేకరణ కోసం చర్యలు తీసుకుంటున్నాం. దీనిపై ప్రజల్లో అవగాహన పెంచడానికి మహిళా సంఘాల సభ్యులు కృషి చేస్తున్నారు. పట్టణంలో పేరుకుపోయిన చెత్త, ఇతర వ్యర్థాలను ట్రాక్టర్లలో డంపింగ్‌యార్డుకు తరలిస్తున్నాం. డంపింగ్ యార్డులో వ్యర్థాల నిర్వహణకు అవసరమైన ఏర్పాట్లు చేశాం.
– జానకీరామ్, మున్సిపల్ కమిషనర్, గద్వాల
గద్వాలటౌన్: ప్రతి మున్సిపాలిటీలో తడి, పొడి చెత్త వేర్వేరుగా సేకరించి, రీసైక్లింగ్ చేయాలనే ప్రభుత్వ ఆదేశాలు ఉన్నప్పటికీ.. ఘనత వహించిన గద్వాల మున్సిపాలిటీలో మాత్రం పరిస్థితులు అందుకు భిన్నంగా ఉన్నాయి. జిల్లా కేంద్రమైన గద్వాలలో చెత్త నిర్వహణ నానాటికీ గాడి తప్పుతోంది. ముఖ్యంగా తడి, పొడి నిర్వహణ అత్యంత అధ్వానంగా ఉంది. పట్టణ ప్రజల్లో అవగాహన లేమి, అధికారుల ప్రచార లోపం, పర్యవేక్షణ లోపంతో ప్రభుత్వ లక్ష్యాన్ని చేరుకోవడం లేదు.
అటకెక్కిన పారిశుద్ధ్య నిర్వహణ..
రోజు నివాసగృహాలతో పాటు హోటళ్లు, రెస్టారెంట్లు, మాంసాహార దుకాణాలు, వ్యాపార సముదాయాల నుంచి పారిశుద్ధ్య కార్మికులు చెత్త సేకరిస్తున్నారు. తడి, పొడి చెత్త సేకరణపై గతంలో విస్తృతంగా అవగాహన కల్పించేవారు. తడి, పొడి చెత్త వేరు చేయడానికి ఇంటింటికీ చెత్త డబ్బాలు కూడా పంపిణీ చేశారు. ప్రస్తుతం ఆ చెత్త డబ్బాలు చాలా వరకు ఇళ్లలో కనిపించడం లేదు. కొంతమంది ఇతర అవసరాలకు వినియోగిస్తుండగా.. మరికొన్ని ఇళ్లలో పాడయ్యాయి. దీనికి తోడు కొంతకాలంగా మున్సిపల్ అధికారులు చొరవ తీసుకోకపోవడం.. ప్రజలు కూడా పెద్దగా ఆసక్తి చూపకుండా అన్నిరకాల చెత్తను కలిపి ఇస్తుడటం సమస్యగా మారింది. ఇలా సేకరించిన చెత్తను మున్సిపల్ సిబ్బంది డంపింగ్‌యార్డులో గుట్టలు గుట్టలుగా వేస్తున్నారు.
తడి.. పొడి ఊసేది?
తడి.. పొడి ఊసేది?


