
దరఖాస్తుల ఆహ్వానం
గద్వాల: ప్రభుత్వ మెడికల్ కళాశాలలో 2025–26 విద్యాసంవత్సరానికి గాను డీఎంఎల్‌టీ, డీఈసీజీ కోర్సుల్లో ప్రవేశాల కోసం అర్హులైన అభ్యర్థుల నుంచి దరఖాస్తులు ఆహ్వానిస్తున్నట్లు కళాశాల ప్రిన్సిపాల్ డా.మహబూబ్‌ఖాన్ మంగళవారం ఒక ప్రకటనలో తెలిపారు. ఇంటర్మీడియట్ బైపీసీ ఉత్తీర్ణులై తెలంగాణ రాష్ట్రానికి చెందిన అభ్యర్థులకు మాత్రమే ప్రాధాన్యత ఉంటుందన్నారు. బైపీసీ అభ్యర్థులు అందుబాటులో లేనిపక్షంలో ఇతర గ్రూపుల అభ్యర్థులను సైతం పరిగణనలోకి తీసుకుంటారన్నారు. ప్రభుత్వ సంస్థ ప్రిన్సిపాల్ ద్వారా ఎంపిక విధానం ఉంటుందని తెలిపారు. అర్హులైన అభ్యర్థులు tgpmh. telangana.gov.in వెబ్‌సైట్‌ల లో దరఖాస్తు చేసుకోవాలని సూచించారు. అభ్యర్థుల సర్టిఫికెట్ల జిరాక్స్ దరఖాస్తు ఫారానికి జతచేసి సంబంధిత అధికారికి ఈ నెల 28వ తేదీలోగా అందజేయాలని సూచించారు.
ఆధునిక పద్ధతులతో అధిక దిగుబడి
గట్టు: రైతులు ఆధునిక పద్ధతులు అనుసరించి అధిక దిగుబడి సాధించాలని జిల్లా వ్యవసాయశాఖ అధికారి జగ్గునాయక్ సూచించారు. రైతునేస్తం కార్యక్రమంలో భాగంగా మంగళవారం గొర్లఖాన్‌దొడ్డి రైతువేదికలో నిర్వహించిన సమావేశంలో ఆయన మాట్లాడారు. పంటల సాగులో అవసరానికి మించి ఎరువులు, క్రిమిసంహారక మందులు వాడొద్దని రైతులకు సూచించారు. తప్పనిసరిగా వ్యవసాయ అధికారుల సలహాలు, సూచనలు పాటించాలన్నారు. అనంతరం పత్తి విక్రయానికి సంబంధించి రైతులు కాపస్ కిసాన్ యాప్‌లో స్లాట్ బుక్ చేసుకునే విధానంపై అవగాహన కల్పించారు. నేషనల్ మిషన్ ఆన్ ఎడిబుల్ ఆయిల్స్ పథకం కింద వంద శాతం రాయితీపై వేరుశనగ విత్తనాలు పంపిణీ చేశారు. కార్యక్రమంలో వ్యవసాయ అధికారి హనుమంతురెడ్డి, పీఏసీఎస్ చైర్మన్ వెంకటేశ్, ఎఫ్‌పీఓ డైరెక్టర్ తిమ్మప్ప పాల్గొన్నారు.
అభివృద్ధి పట్టని పాలకులు
రాజోళి: గ్రామీణ ప్రాంత రోడ్లు గుంతలమయంగా మారినా పాలకులు పట్టించుకోవడం లేదని సీపీఎం జిల్లా కార్యదర్శి ఎ.వెంకటస్వామి, కేవీపీఎస్ జిల్లా అధ్యక్షుడు పరంజ్యోతి అన్నారు. ఈ మేరకు మంగళవారం రాజోళి–శాంతినగర్ రోడ్డుపై రాస్తారోకో నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. రాజోళి నుంచి 3 కి.మీ. దూరంలోని శాంతినగర్‌కు వెళ్లేందుకు 30 నిమిషాలకు పైగా సమయం పడుతుందన్నారు. గుంతల రోడ్డుపై ఎంతో మంది కిందపడి గాయపడినా ఎవరికీ పట్టడం లేదని వాపోయారు. ఈ రోడ్డును బాగుచేయాలని కొన్నేళ్లుగా పాలకులు, అధికారులకు విన్నవిస్తున్నా పట్టించుకున్న పాపాన పోవడం లేదన్నారు. ప్రజాపాలన, ఇందిరమ్మ రాజ్యం అంటూ ప్రగల్భాలు పలికే నాయకులు ఈ రోడ్డుపై ఎందుకు మౌనంగా ఉంటున్నారని ప్రశ్నించారు. వెంటనే రోడ్డుకు మరమ్మతు చేయించాలని డిమాండ్ చేశారు. కాగా, విషయం తెలుసుకున్న రాజోళి తహసీల్దార్ రామ్మోహన్ అక్కడికి చేరుకుని రెండు రోజుల్లో మరమ్మతు చేయిస్తామని హామీ ఇవ్వడంతో ఆందోళన విరమించారు. కార్యక్రమంలో కేవీపీఎస్ జిల్లా ప్రధాన కార్యదర్శి రాజు, మండల కార్యదర్శి విజయ్‌కుమార్, మాజీ ఉపసర్పంచ్ గోపాల్, గోపాల్‌రెడ్డి, జయన్న, గోకారి, రాజు, మహేశ్ పాల్గొన్నారు.
ప్రతి విద్యార్థి ఉన్నత లక్ష్యం నిర్దేశించుకోవాలి
గద్వాలటౌన్: ప్రతి విద్యార్థి ఉన్నత లక్ష్యం నిర్దేశించుకొని ముందుకుసాగాలని డీఈఓ విజయలక్ష్మి అన్నారు. జిల్లా కేంద్రంలోని బాలభవన్‌లో మంగళవారం ఎస్‌ఈఆర్‌టీ ఆధ్వర్యంలో జనాభా విద్యా విభాగం వారిచే రోల్ ప్లే కాంపిటీషన్ నిర్వహించారు. ఈ సందర్భంగా ఇంటర్నెట్ వినియోగంపై పోటీలు నిర్వహించగా.. జిల్లాలోని అన్ని ప్రభుత్వ, ప్రైవేటు పాఠశాలల విద్యార్థులు ఉత్సాహంగా పాల్గొని ప్రతిభ చాటారు. అత్యుత్తమ ప్రతిభకనబర్చిన అమరవాయి జెడ్పీహెచ్‌ఎస్ విద్యార్థులు ప్రథమ బహుమతి గెలుపొందారు. ప్రభుత్వ అభ్యసన ఉన్నత పాఠశాల విద్యార్థులు ద్వితీయ, మోహిన్‌మహిల్లా ప్రభుత్వ పాఠశాల విద్యార్థులు తృతీయ బహుమతులు సాధించారు. విజేతలకు డీఈఓ విజయలక్ష్మి మెమోంటోలు, ప్రశంసాపత్రాలను అందజేశారు. కార్యక్రమంలో జిల్లా సమన్వయ అధికారిణి ఎస్తేరు రాణి తదితరులు పాల్గొన్నారు.

దరఖాస్తుల ఆహ్వానం