
మద్దతు ధరకు పత్తి కొనుగోలు
● తెలంగాణ రాష్ట్రాన్ని అన్ని రంగాల్లో అగ్రగామిగా నిలబెట్టేందుకు రాష్ట్ర ప్రభుత్వం తెలంగాణ రైజింగ్ విజన్–2047 డాక్యుమెంట్‌ను రూపొందిస్తుందని కలెక్టర్ అన్నారు. ఈ సర్వేలో ప్రభుత్వ ఉద్యోగులందరూ పాల్గొనాలని సూచించారు.
గద్వాల: రైతులు పండించిన పత్తికి ప్రభుత్వం మద్దతు ధర కల్పిస్తున్నట్లు కలెక్టర్ బీఎం సంతోష్ అన్నారు. మంగళవారం కలెక్టర్ చాంబర్‌లో కనీస మద్దతు ధరల పోస్టర్ ఆవిష్కరించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ.. రైతులు పత్తిని విక్రయించే ముందు కాపస్ కిసాన్ యాప్‌లో స్లాట్ బుక్ చేసుకోవాలని సూచించారు. 2025–26 సీజన్‌లో బీబీ మోడ్ పత్తి రకానికి రూ. 8,110, బీబీ ఎస్‌పీఎల్ రకానికి రూ. 8,060, మెక్ రకానికి రూ. 8,010 మద్దతు ధరలు కల్పిస్తున్నట్లు వివరించారు. కాపస్ కిసాన్ యాప్‌లో స్లాట్ బుకింగ్ సందర్భంగా వచ్చే ఓటీపీ కోసం ఆధార్ లింక్ ఉన్న మొబైల్ వినియోగించాలని తెలిపారు. బ్యాంక్ ఖాతాను ఆధార్‌తో లింక్ చేయించుకోవాలన్నారు. అదే విధంగా పత్తిలో తేమ 8–12శాతం మించరాదన్నారు. జిల్లాలో పత్తి సేకరణ కోసం హరిత కాటన్ మిల్లు, బాలాజీ కాటన్ జిన్నింగ్ మిల్లు, శ్రీవరసిద్ది వినాయక కాటన్ మిల్లులో కొనుగోలు కేంద్రాలను ఏర్పాటు చేసినట్లు తెలిపారు. ఈ నెల 27 నుంచి పత్తి కొనుగోలు ప్రారంభిస్తామన్నారు. పూర్తి సమాచారం కోసం టోల్‌ఫ్రీ నంబర్ 18005995779 లేదా 88972 81111 నంబర్‌ను సంప్రదించాలని సూచించారు. కార్యక్రమంలో జిల్లా మార్కెటింగ్ అధికారి పుష్పమ్మ, కార్యదర్శి నర్సింహ, ఎల్లస్వామి పాల్గొన్నారు.
● బెస్ట్ అవైలబుల్ పాఠశాలల్లో చదువుతున్న విద్యార్థుల సంక్షేమంపై ప్రత్యేక దృష్టి సారించినట్లు కలెక్టర్ బీఎం సంతోష్ అన్నారు. మంగళవారం డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్క నిర్వహించిన వీడియో కాన్ఫరెన్స్‌లో ఆయన పాల్గొన్నారు. అనంతరం జిల్లా అధికారులతో ఏర్పాటుచేసిన సమావేశంలో మాట్లాడారు. విద్యార్థులకు మెరుగైన విద్యాబోధన, వారి ఆరోగ్య సంరక్షణపై ప్రత్యేక శ్రద్ధ చూపాలని అధికారులకు సూచించారు. ఏమైనా సమస్యలు ఉంటే తన దృష్టికి తీసుకురావాలన్నారు. సమావేశంలో అదనపు కలెక్టర్ నర్సింగ్‌రావు ఉన్నారు.