
సమాలోచనలు..!
మద్యం దుకాణాల టెండర్లపై వ్యూహాత్మకంగా ముందుకు..
సిండికేట్‌గా ముందుకు..
గద్వాల క్రైం: మద్యం దుకాణాలకు సంబంధించి నోటిఫికేషన్ వచ్చి దాదాపు రెండు వారాలు కావస్తున్నా.. జిల్లాలో తూతూ మంత్రంగా టెండర్లు దాఖలు కావడం గమనార్హం. రూ.2 లక్షల నుంచి రూ.3 లక్షలకు డిపాజిట్ ధర పెంచడం.. షాపు లైసెన్స్ ఫీజు సైతం 50 శాతం పెంపు.. చివరగా లక్కీ డ్రాలో అదృష్టం వరిస్తుందో లేదోనన్న బెంగ.. దీంతో కొందరు వ్యాపారులు సమాలోచనలు చేస్తున్నారు. జిల్లాలోని గద్వాల– అలంపూర్ సెగ్మెంట్‌లోని 34 వైన్ షాపుల కోసం వ్యాపారుల నుంచి దరఖాస్తుల ప్రక్రియను చేపట్టింది. ఇందులో జనరల్ 23, గౌడ కులస్తులకు 5, ఎస్సీ కులస్తులకు 6 షాపులు కేటాయించింది. దరఖాస్తు ఫీజును పెంచిన నేపథ్యంలో వ్యాపారులు మద్యం దుకాణాలను దక్కించుకునేందుకు వ్యూహాత్మకంగా పావులు కదుపుతున్నారు.
జిల్లాలో గత కొన్ని నెలలుగా రియల్ ఎస్టేట్ వ్యాపారం పూర్తిగా గడ్డు పరిస్థితిలో ఉంది. దీంతో సదరు వ్యాపారులు మద్యం వ్యాపారం వైపు ఆసక్తి కనబరుస్తున్నారు. రెండు సంవత్సరాల పాటు మద్యం వ్యాపారం చేసేందుకు వెసులుబాటు ఉండడంతో అందరం కలిసి సిండికేట్‌గా వ్యాపారం చేద్దామని వ్యాపారులు సన్నద్ధమయ్యారని సమాచారం. ఇదిలాఉండగా 2023లో 36 మద్యం దుకాణాలకు ప్రభుత్వం అనుమతి ఇవ్వగా 1,171 దరఖాస్తులు వచ్చాయి. వీటి ద్వారా రూ.23.42 కోట్ల ఆదాయం సమకూకురింది. ప్రస్తుతానికి వచ్చేసరికి 34 మద్యం దుకాణాలకు అనుమతి ఇచ్చింది. ఇక టెండర్ల విషయానికి వస్తే.. ఈ నెల 8వ తేదీన ఒక టెండర్, 9న 11, 10వ తేదీన 5 టెండర్లు దాఖలయ్యాయి.
జిల్లాలోని మద్యం దుకాణాల కోసం నోటిఫికేషన్ జారీ అయినప్పటి నుంచి ఈ నెల 7వ తేదీ వరకు ఒక్క టెండర్ దాఖలు కాలేదు. అయితే ఇక్కడి వ్యాపారులు సెంటిమెంట్ ఫాలో అవుతున్నారని సమాచారం. ఫలానా తేదీన టెండర్ వేస్తే ఖచ్చితంగా లక్కీ డ్రాలో అదృష్టం తమనే వరిస్తుందని జ్యోతిష్యులు చెప్పడంతో ఆ దిశగా ఆలోచిస్తున్నారని తెలిసింది. ఎలాగూ స్థానిక ఎన్నికల నేపథ్యంలో మద్యం వ్యాపారం భారీ స్థాయిలో ఉంటుంది. దీంతో జనరల్, వివిధ కేటగిరీల్లో రిజర్వేషన్ ఉన్న నేపథ్యంలో ఆయా కేటగిరిలోని వారికి మద్యం వ్యాపారంపై ఆసక్తి, ఆర్థిక స్థోమత లేకపోవడంతో లిక్కర్ సామ్రాజ్యంలో చక్రం తిప్పే కొందరు వ్యాపారులు బినామీలుగా మరికొందరితో టెండర్లు వేయించే పనిలో పడ్డారు. గతంలో నిర్వహించిన మద్యం దుకాణాల టెండర్లలో దరఖాస్తులు వెల్లువలా వచ్చాయి. ఈసారి కూడా మద్యం దుకాణాలకు భారీ స్థాయిలో దరఖాస్తులు వచ్చే అవకాశం ఉంది. అప్పట్లో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో మద్యం టెండర్లు లేకపోవడం, ధరలు అధికంగా ఉండడంతో ఊహించని విధంగా అలంపూర్ సెగ్మెంట్‌లో మద్యం వ్యాపారం కొనసాగింది. ఈసారి అక్కడి రాష్ట్రంలో మద్యం టెండర్లు నిర్వహించింది. గతంలో ఉన్న పోటీ ప్రస్తుతం లేకపోవచ్చనే అనుమానం వ్యక్తమవుతోంది.
పెరిగిన డిపాజిట్ నేపథ్యంలో
సిండికేట్‌పైనే వ్యాపారుల ఆసక్తి
మొత్తం 17 టెండర్లు దాఖలు