
సాగులో నూతన పద్ధతులు అవలంబించాలి
గద్వాల వ్యవసాయం: నూతన పద్ధతులతో వ్యవసాయం చేయాలని పాలెం వ్యవసాయ శాస్త్రవేత్తలు శశిభూషణ్, శంకర్, ఈశ్వర్‌రెడ్డి శ్రీరామ్ రైతులకు సూచించారు. శుక్రవారం మండలంలోని కొత్తపల్లి, అనంతాపురం గ్రామాల్లో సాగు చేసిన వరి, మినుము పంటలను పరిశీలించారు. ఈసందర్భంగా వారు రైతులకు పలు సూచనలు చేశారు. వ్యవసాయంలో నూతన పద్ధతులను వివరించారు. వీటిని అవలంభించడం వల్ల అధిక దిగుబడులు సాధించవచ్చునని చెప్పారు. వరి పంటలో చీడపీడల నివారణకు సమగ్ర సస్య రక్షణ చర్యలు, యాజమాన్య పద్ధతుల గురించి, వాతావరణ పరిస్థితులను బట్టి పంటలో వచ్చు తెగుళ్ల గురించి రైతులకు వివరించారు. వరిలో వచ్చే సుడిదోమ, దోమపోటు నివారణకు లీటర్ నీటికి ఎసిఫేట్ 1.5గ్రా. లేదా మోనోక్రోటోఫాస్ 2.2మి.లీ. లేదా ఇథోఫెన్‌ఫ్రాక్స్ 2మి.లీ పిచికారి చేయాలన్నారు. ఉల్లకోడు, దుపరోగం నివారణకు నారుమడిలో మొలకెత్తిన 10 నుంచి 15రోజుల లోపు ఒక సెంటుకు 160గ్రా. కార్బోప్యూరన్ 3కేజీల గుళికలు లేదా 50గ్రా. ఫోరెట్ గుళికలను చల్లాలని చెప్పారు. అలాగే కంరినల్లి నివారణకు ఫ్రోఫిన్‌ఫాస్ 2 మి.లీ. లేదా డైకోఫాట్ 5.మి.లీ. లేదా స్పైరోమెసిఫిన్ 1మి.లీ. ఫ్రోఫికోనజోల్ కలిపి ఒకసారి ఆ తర్వాత 15రోజులకు మరోసారి పిచికారీ చేయాలని సూచించారు. కార్యక్రమంలో ఏఈఓ హరీష్, రైతులు లక్ష్మీభూపాల్‌రెడ్డి, క్రిష్ణ, వెంకట్రాములు తదితరులు ఉన్నారు.