
గెలుపోటముల కంటే క్రీడాస్ఫూర్తి ముఖ్యం
గద్వాలటౌన్: గెలుపు ఓటముల కంటే పోటీల్లో క్రీడాస్ఫూర్తిని ప్రదర్శించడం ముఖ్యమని ఫుట్‌బాల్ అసోసియేషన్ జిల్లా అధ్యక్షుడు బండల వెంకట్రాములు పేర్కొన్నారు. రాష్ట్రస్థాయి సీనియర్స్ ఫుట్‌బాల్ పోటీల కోసం జిల్లా ఫుట్‌బాల్ అసోసియేషన్ ఆధ్వర్యంలో నిర్వహించిన జిల్లా స్థాయి ఎంపిక పోటీలు ఉత్సాహంగా సాగాయి. శనివారం స్థానిక తేరుమైదానంలో జిల్లాస్థాయి ఎంపిక పోటీలు నిర్వహించారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సమావేశంలో ఆయన మాట్లాడారు. పట్టుదల, శ్రద్ధ అనేది క్రీడల వల్ల అలవడతాయన్నారు. జిల్లాస్థాయిలో ప్రతిభ చాటిన 20 మంది క్రీడాకారులను రాష్ట్రస్థాయి పోటీలకు ఎంపిక చేశారు. ఈ నెల 25 నుంచి 28వ తేదీ వరకు మహబూబ్‌నగర్‌లో జరిగే రాష్ట్రస్థాయి ఫుట్‌బాల్ పోటీలలో పాల్గొననున్నారు.