
వాహన ఫిట్‌నెస్ విషయంలో వాగ్వాదం
● ఎంవీఐ, ఏజెంట్ మధ్య
మాటల యుద్ధం
● సామాజిక మాద్యమాల్లో
వీడియో వైరల్
గద్వాల క్రైం: ఓ వాహన ఫిట్‌నెస్ పరీక్ష నేపథ్యంలో మోటార్ వెహికల్ ఇన్‌స్పెక్టర్ (ఎంవీఐ), ఏజెంట్ వాగ్వాదానికి దిగిన ఘటన జిల్లాలో చర్చనీయాంశమైంది. వారిద్దరూ వాగ్వాదం చేసుకుంటున్న ఓ వీడియో కాస్తా సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది. పూర్తి వివరాల్లోకి వెళ్తే.. ఓ వాహనాదారుడి మినీ డీసీఎంకు సంబంధించి ఫిట్‌నెస్ అనుమతి కోసం గద్వాల డీటీఓ కార్యాలయానికి ఓ ఏజెంట్ తీసుకువచ్చారు. అయితే, ఎంవీఐ సదరు వాహనం తనిఖీ చేసిన క్రమంలో వాహనానికి ఇరువైపులా పసుపు రంగు స్టిక్కర్ లేకపోవడంతో.. స్టిక్కర్ వేసి తీసుకువస్తే ఫిట్‌నెస్ పరీక్షలు పూర్తి చేస్తామని ఏజెంట్‌కు వివరించాడు. ఈ క్రమంలో ఏజెంట్, అధికారి మధ్య వాగ్వాదం చోటు చేసుకుంది. నిబంధనలకు విరుద్ధంగా ఫిట్‌నెస్ పరీక్షలు చేయడం కుదరదని చెప్పడంతో.. నేను ముందే చెప్పాను, ఇప్పుడు చేయను అంటే ఎలా అని ప్రశ్నించాడు. దీంతో ఇరువురి మధ్య మాటామాటా పెరిగింది. ఓ క్రమంలో నా మీదే బ్రతుకుతున్నావ్ అని ఏజెంట్.. నా సంతకంతో బతుకుతున్నావంటూ ఏంవీఐ ఒకరిపై ఒకరు ఆగ్రహం వ్యక్తం చేశారు.
ఇన్‌చార్జ్జి డీటీఓ వాకబు
విషయం తెలుసుకున్న ఇన్‌చార్జి డీటీఓ కృష్ణారెడ్డి కార్యాలయానికి వచ్చి వాకబు చేశారు. ఇద్దరి మధ్య జరిగిన సంఘటనను సిబ్బంది వివరించారు. అనంతరం ఇన్‌చార్జ్ డీటీఓ మాట్లాడుతూ.. ఎంవీఐ, ఏజెంట్ వాగ్వాదంపై ఇప్పటికే విచారణ చేపట్టామని, ఒకవేళ ఎంవీఐపై తప్పిదమని తెలితే శాఖ పరమైన చర్యలు తీసుకుంటామని, కార్యాలయం సమీపంలో ఉన్న ఏజెంట్‌లను పూర్తి స్థాయిలో నిలువరిస్తామన్నారు. వాహనాదారులు సైతం సేవల కోసం నేరుగా కార్యాలయానికి రావాలని, ఏజెంట్లను ఆశ్రయించవద్దని, ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా చర్యలు తీసుకుంటామన్నారు.