
విద్యార్థుల హాజరుశాతం పెంచాలి
మల్దకల్: ప్రభుత్వ కళాశాలలో చదువుతున్న విద్యార్థులందరికి మెరుగైన విద్యాబోధన అందజేసి వారి విద్యాభివృద్దికి అధ్యాపకులు కృషి చేయాలని ఇంటర్మీడియెట్ జిల్లా అధికారి హృదయరాజు సూచించారు. గురువారం మల్దకల్ ప్రభుత్వ జూనియర్ కళాశాలను ఆయన ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఈసందర్భంగా కళాశాలలో విద్యార్థుల, అధ్యాపకుల హాజరు నమోదును పరిశీలించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ విద్యార్థుల హాజరు శాతం పెంచడానికి అధ్యాపకులు ప్రత్యేక శ్రద్ద తీసుకోవాలన్నారు. పాఠ్యాంశాలను నిరంతరం బోధిస్తూ అంతర్గత పరీక్షలను సమయానుకూలంగా నిర్వహించి విద్యార్థుల ఉత్తీర్ణత శాతం పెంచేందుకు కృషి చేయాలన్నారు. అదే విధంగా కళాశాల పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుకోవాలన్నారు. ప్రతి విద్యార్థి ఉన్నత లక్ష్యంతో చదువుకుని ఉన్నతంగా ఎదగాలని సూచించారు. కార్యక్రమంలో ప్రిన్సిపాల్ కృష్ణ, అధ్యాపకులు నర్సింహులు, రామాంజనేయులు గౌడ్, గోవర్దన్ శెట్టి భాగ్యలక్ష్మీ, మాధురి, రాఘవేంద్ర, శ్రీకాంత్, బాలకృష్ణ, సుధాకర్, రంగస్వామి, నీలవేణి తదితరులు పాల్గొన్నారు.