
దేవీ శరన్నవరాత్రి ఉత్సవ ఏర్పాట్ల పరిశీలన
అలంపూర్: అష్టాదశ శక్తిపీఠాల్లో ఒకటైన అలంపూర్ జోగుళాంబ క్షేత్రంలో నిర్వహించనున్న శరన్నవరాత్రి ఉత్సవాలపై అధికారులు ప్రత్యేక దృష్టి సారిస్తున్నారు. ఉత్సవాలు సమీపిస్తుండటంతో భక్తులకు కల్పించే వసతులు, సౌకర్యాలపై సమీక్షిస్తున్నారు. ఈమేరకు గురువారం శరన్నవరాత్రి ఉత్సవ ఏర్పాట్లను డీఎస్పీ మొగులయ్య, సీఐ రవిబాబు, ఆలయ ఈఓ దీప్తి ఆలయ ధర్మకర్తలతో కలిసి పరిశీలించారు. ఆలయంలో ఈ నెల 22వ తేదీ నుంచి దేవి శరన్న నవరాత్రి ఉత్సవాలు ప్రారంభం కానున్నాయి. ఉత్సవాల్లో జోగుళాంబ అమ్మవారు పలు అవతారాల రూపంలో దర్శనమివ్వనున్నారు. ఉత్సవాల్లో పాల్గొనేందుకు వేలాదిగా తరిలి వచ్చే భక్తులకు దర్శనానికి క్యూలైన్‌లు, వాహనాల పార్కింగ్, ట్రాఫిక్ ఇబ్బందులు కలగకుండా చేపట్టాల్సిన ఏర్పాట్లపై ఆరా తీశారు. అలాగే, జోగుళాంబ ఆలయంలో తొమ్మిది రోజులపాటు జరిగే ప్రత్యేక కార్యక్రమాలు, దశమి రోజు జరిగే తెప్పోత్సవం నిర్వహణపై అధికారులు సుధీర్ఘంగా చర్చించారు. ఈమేరకు ఆలయ పరిసరాలు, తుంగభద్ర నది తీరం, పుష్కరఘాట్‌ను పరిశీలించారు. భక్తులు ఇబ్బందులు కలగకుండా సౌకర్యాలతోపాటు పార్కింగ్, రవాణా అంశాలపై ప్రధానంగా చర్చించారు. ఎస్‌ఐ వెంకస్వామి, ధర్మకర్తలు నాగశిరోమణి, అడ్డాలకు రాము, జగన్ గౌడ్, గోపాల్, ఆలయ అధికారులు బ్రహ్మయ్య ఆచారి, రాజేష్, కాంతు ఉన్నారు.