
మెరుగైన సేవలు అందించడమే ట్రాయ్ లక్ష్యం
గద్వాలన్యూటౌన్: టెలికాం వినియోగదారులకు మెరుగైన సేవలు అందించడమే ట్రాయ్ (టెలికాం రెగ్యూలేటరీ ఆథారిటీ ఆఫ్ ఇండియా) లక్ష్యమని రాష్ట్ర ట్రాయ్ కాగ్ సభ్యులు కళ్లెపు శోభారాణి అన్నారు. గురువారం మండలంలోని శెట్టిఆత్మకూర్‌లో స్వయం సహాయ సంఘాల ప్రతినిధులు, స్వయం సహాయక సంఘాల మహిళలు, గ్రామ ప్రజలకు... టెలికాం సంబంధిత వినియోగాలపై అవగాహన సదస్సు నిర్వహించారు. ఈసందర్భంగా ఆమె మాట్లాడుతూ.. 1997లో టెలికాం వినియోగదారుల హక్కుల కోసం టెలికాం రెగ్యూలేటరీ అథారిటీ ఆఫ్ ఇండియా యాక్ట్ తీసుకరావడం జరిగిందని చెప్పారు. మొబైల్ వినియోగదారులు టెలికాం సంస్థల నుంచి ఉత్తమ సేవలు పొందేందుకు ఈ తరహా సదస్సులు నిర్వహిస్తున్నామన్నారు. మొబైల్ నెంబర్ పోర్టబిలిటీ పత్రాన్ని 2006లో తీసుకరావడం జరిగిందన్నారు. ఇప్పటివరకు 48కోట్ల మంది వినియోగదారులు వినియోగించుకున్నారని తెలిపారు. అవాంచిత కాల్స్ మొబైల్ వినియోగదారులకు ప్రధాన సమస్యగా మారడాన్ని ట్రాయ్ గుర్తించి, 1909 నెంబర్‌కు కాల్ చేసి ఫిర్యాదు చేస్తే ఆ నెంబర్‌ను బ్లాక్ చేయడం జరుగుతుందని పేర్కొన్నారు. 2025 నాటికి అందరూ బ్రాడ్ బ్రాండ్ కలిగి ఉండేలా దేశ వ్యాప్తంగా 6లక్షల గ్రామాల్లో అంతర్జాల సేవలు అందుబాటులోకి తేవడానికి కృషి చేస్తున్నామన్నారు. టెలీ మార్కెటింగ్ కాల్స్‌ను అడ్డుకోవడానికి డి.ఎన్.డి. అనే యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకొని, నంబర్‌ని నమోదు చేసుకుంటే అనవసరమైన వ్యాపార సంస్థల కాల్స్ రావని చెప్పారు. ఒకవేళ కాల్స్ వస్తే సంబంధిత వ్యాపార సంస్థలకు ట్రాయ్ జరిమానా విధిస్తుందన్నారు. ప్రతి ఒక్కరు టెలికాం రంగంపై పూర్థి స్థాయిలో అవగాహన కలిగి ఉండి, తమను తాము కాపాడుకునేవిదంగా ఉండాలని కోరారు. కార్యక్రమంలో డీఆర్‌డీఏ డీపీఎం సలోని, ఏపీఎం దేవానంద, సీసీలు వెంకటనారాయణ, రంగన్న, గ్రామకార్యదర్శి దీపమాలిని, కోఆర్డినేటర్ రమేష్ తదితరులు పాల్గొన్నారు.