
పక్కాగా పంటల నమోదు!
గద్వాల వ్యవసాయం: గడిచిన వారం రోజుల నుంచి జిల్లాలో పంటల నమోదు (డిజిటల్ క్రాప్ సర్వే.. బుకింగ్) పక్కాగా సాగుతోంది. దీంతో ఆయా ప్రాంతాల్లో ఎన్ని ఎకరాల్లో ఏ రకమైన పంటలు వేశారు.. దిగుబడి అంచనా.. వ్యవసాయ పంటల సాగు వివరాలు తెలియనుంది. ఈవివరాలతో మద్దతు ధర, కొనుగోలు కేంద్రాల ఏర్పాటు, ఆహారధాన్యాల లభ్యతపై ప్రభుత్వానికి స్పష్టత వస్తుంది.
సాంకేతికతను జోడించి..
జిల్లాలో కృష్ణా, తుంగభద్ర నదులతోపాటు జూరాల, ఆర్డీఎస్ ప్రాజెక్ట్‌లతో పాటు, నెట్టెంపాడు ఎత్తిపోతల దానికింద ఆరు రిజర్వాయర్లు ఉన్నాయి. వీటి కిందతో పాటు బోర్లు, బావుల కింద ఇక్కడి రైతులు వ్యవసాయం చేస్తున్నారు. ఏటా వానాకాలం సీజన్‌లో 3.80 లక్షలు, యాసంగిలో 1.30లక్షల ఎకరాల్లో పంటలు సాగు చేస్తున్నారు. పత్తి, సీడ్‌పత్తి, వరి, కంది, మిరప, వేరుశనగ పంటలు వేస్తున్నారు. ఇంకా ఉద్యాన, వాణిజ్య పంటల సాగు కూడా ఇక్కడ ఉంది. ఇదిలాఉండగా, పంటల వివరాలు పక్కగా తెలుసుకుని, దాని ద్వార మద్దతు ధరలను నిర్ణయించడం, కొనుగోలు కేంద్రాల ఏర్పాటు తదితరమైనవి చేసేందుకు గాను ప్రభుత్వం సాంకేతికతను జోడించి (డిజిటల్ క్రాప్ సర్వే అండ్ బుకింగ్) పంటల నమోదు కార్యాక్రమానికి శ్రీకారం చుట్టింది. కాగా జిల్లాలో ఈ వానాకాలం సీజన్‌లో దాదాపు 3,28,641 ఎకరాల్లో వివిద రకాల వ్యవసాయ పంటలు సాగు అయ్యాయని వ్యవసాయశాఖ అంచనాకు వచ్చింది. ఈఅంచనాకు అనుగుణంగా జిల్లాలో 97వ్యవసాయ క్లస్టర్లలో వారం రోజల క్రితం పంటల నమోదును ఆరంభించింది. ఒక్కో వ్యవసాయవిస్తరణ అధికారికి 2వేల ఎకరాల్లో పంటల సర్వే, నమోదు చేసేలా లక్ష్యంగా నిర్ధేశించారు. ఈసర్వేలో భాగంగా ప్రత్యేకంగా రూపొందించిన డీసీఎస్ యాప్‌లో మొబైల్ ద్వారా వివరాలు పొందుపరుస్తారు. ఈయాప్ ఓపెన్ చేసిన వెంటనే కెడెస్టల్ మ్యాప్ డిస్‌ప్లే అవుతుంది. ఆ మ్యాప్‌లో ఐదు నుంచి 10 మంది రైతుల పేర్లు, వారి భూముల సర్వే నెంబర్లు వస్తాయి. అక్షాంశ, రేఖాంశలతో వివరాలు నమోదు చేయాల్సి ఉంటుంది కాబట్టి ఏఈఓ ఖచ్చితంగా సంబంధిత రైతును సెలక్ట్ చేసుకొని, సర్వే నంబర్ ఉన్న భూమి దగ్గరకు వెళ్తున్నారు. రైతుల పొలాల దగ్గరకు వెళ్లిరైతు పేరు, ఆధార్‌నంబర్‌తో పాటు ఏపంట ఎన్ని ఎకరాల్లో వేశారో నమోదు చేస్తున్నారు. దీంతో ఉదాహరణకు వరి వేస్తే.. సాధారణమా, ఆర్‌ఎన్‌ఆర్ రకమా తెలుసుకొని వరి వివరాలన్నీ నమోదు చేయడంతో పాటు, పంట ఫొటోను కూడా అప్‌లోడ్ చేస్తున్నారు. 3,28,641 ఎకరాల్లో పంటల సర్వే, నమోదు లక్ష్యంగా ఉండగా ఇప్పటివరకు 29,200 ఎకరాల్లో (8.89శాతం) పూర్తి అయ్యింది.
కొనసాగుతున్న డిజిటల్ క్రాప్ సర్వే
3.28 లక్షల ఎకరాలు లక్ష్యం
ఇప్పటివరకు 29,200 ఎకరాలు పూర్తి
సర్వేతో పంటల దిగుబడిపై అంచనా.. వ్యవసాయ పురోగతికి దోహదం