
లోక్ అదాలత్‌లో 6,884 కేసులు పరిష్కారం
గద్వాల క్రైం: సుప్రీం కోర్టు ఆదేశాల మేరకు శనివారం గద్వాల కోర్టు ఆవరణలో నిర్వహించిన జాతీయ లోక్ అదాలత్‌లో 6,884 కేసులు పరిష్కారమైనట్లు లోక్ అదాలత్ చైర్మన్, జిల్లా న్యాయమూర్తి ఎన్.ప్రేమలత తెలిపారు. క్రిమినల్, సివిల్, సైబర్ క్రైం, బ్యాంకు లిటిగేషన్ తదితర పెండింగ్ కేసులను ఇరువర్గాల వారిని రాజీ కుదిర్చినట్లు ఆయన తెలిపారు. కార్యక్రమంలో న్యాయమూర్తులు టి.లక్ష్మీ, వెంకట హైమ పూజిత, ఉదయ్‌నాయక్, ఏపీపీలు రెచ్చల్ సంజాన జాషువ, జిల్లా న్యాయ సేవ సంస్థ సెక్రటరీ శ్రీనివాస్, న్యాయవాదులు తదితరులు ఉన్నారు.
ప్రధాని మోదీ పాలనలోనే దేశం అభివృద్ధి
ఎర్రవల్లి: ప్రధాని నరేంద్ర మోదీ పాలనలోనే దేశం అభివృద్ధి చెందుతూ.. సురక్షితంగా ఉందని బీజేపీ జిల్లా అద్యక్షుడు రామాంజనేయులు అన్నారు. శనివారం మండంలోని కోదండాపురంలో ఆ పార్టీ మండలాధ్యక్షుడు జగదీష్‌రెడ్డి ఆధ్వర్యంలో సేవా పక్వాడ్ కార్యక్రమాన్ని నిర్వహించగా ముఖ్యఅతిథిగా ఆయన హాజరై మాట్లాడారు. బీజేపీ పాలనలో ప్రజలకు భద్రతతో పాటు అర్హులైన ప్రతి ఒక్కరికి సంక్షేమ పథకాలు అందుతున్నాయన్నారు. ఉపాధిహామీ పథకం ద్వారా గ్రామాల అభివృద్ధి, రైతుల అభ్యున్నతి కోసం సబ్సిడీపై ఎరువులు, పంటలకు మద్దతు ధరలు, కిసాన్ సమ్మాన్ నిధి యోజన వంటి పథకాలు అందుతున్నాయన్నారు. ప్రపంచ దేశాల్లో మూడో అతిపెద్ద దేశంగా ఉన్న భారత్ బీజేపీ పాలనలో మేక్ ఇన్ ఇండియా ద్వారా తయారు చేసిన ఎన్నో వస్తువులను ఇతర దేశాలకు ఎగుమతి చేస్తుందన్నారు. ఆపరేషన్ సిందూర్‌తో పాకిస్తాన్‌కు తగిన బుద్ది చెప్పి దేశ పవర్ ఎంటో ప్రదాని చూపించారన్నారు. కాంగ్రెస్ హయాంలో ప్రజా సమస్యలను, అభివృద్ధిని పక్కనబెట్టి 2జీ కుంభకోణం, గడ్డి కుంభకోణం, యూరియా వంటి కుంభకోణాలతో పూర్తిగా అవినీతిలో కూడుకుపోయిందన్నారు. రాబోయే స్థానిక సంస్థల ఎన్నికల్లో బీజేపీ అభ్యర్థులకు ఓటు వేసి గెలిపించాలని ఆయన కోరారు. కార్యక్రమంలో జిల్లా ఉపాద్యక్షుడు కేకే రెడ్డి, పరుశరాం నాయుడు, వెంకటరామిరెడ్డి, శివరాంరెడ్డి, విజయ్, నరేష్, మహేష్, బీసన్న, రవి, తదితరులు పాల్గొన్నారు.
హమాలీలకు సంక్షేమ బోర్డు ఏర్పాటు చేయాలి
ఎర్రవల్లి: హమాలీలకు సంక్షేమ బోర్డు ఏర్పాటు చేసి వారికి అవసరమైన సౌకర్యాలు కల్పించాలని సీఐటీయూ జిల్లా అధ్యక్షుడు వెంకటస్వామి అన్నారు. శనివారం మండల కేంద్రంలో హమాలీ యూనియన్ అధ్యక్షుడు యాదన్న ఆధ్వర్యంలో కూడలి బజార్ లోడింగ్, అన్ లోడింగ్ హమాలీ జనరల్ బాడీ సమావేశాన్ని ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమానికి ఆయన హాజరై మాట్లాడారు. ప్రజలకు అవసరమైన నిత్యావసర సరుకులను ప్రతిరోజు లోడింగ్ మరియు అన్ లోడింగ్ పనులు చేస్తూ బరువును మోస్తున్న హమాలీ కార్మికుల పట్ల కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు నిర్లక్ష్యం వహిస్తున్నాయన్నారు. వారికి సంక్షేమ బోర్డు ఏర్పాటు చేసి ప్రభుత్వం నుండి గుర్తింపు కార్డులను ఇవ్వాలన్నారు. ప్రభుత్వ పథకాలలో హమాలీలకు మొదటి ప్రాధాన్యతను ఇవ్వాలని అందులో భాగంగా వారికి ఇందిరమ్మ ఇండ్లు, స్థలాలు కేటాయించాలని అన్నారు. ప్రాణాలను అరచేతిలో పెట్టుకొని బరువును మోస్తూ బతుకును ఈడుస్తున్న హమాలీలకు ప్రభుత్వం తప్పకుండా ఇన్సూరెన్స్ సౌకర్యం కల్పించాలన్నారు. తమ వృత్తితో సమాజానికి సేవచేస్తున్న హమాలీలపై ప్రభుత్వాలు నిర్లక్ష్యం వీడి వారికి తగు సౌకర్యాలు కల్పించి ఆదుకోవాలని ఆయన డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో నాయకులు బీచుపల్లి, శేఖర్, హుస్సేన్, రామకృష్ణ, తిరుపతి, రాజు, గోపాల్, గోవిందు, నాగేష్, కార్మికులు, తదితరులు పాల్గొన్నారు.
వేరుశనగ క్వింటా రూ.5,676
గద్వాల వ్యవసాయం: గద్వాల మార్కెట్ యార్డుకు శనివారం 181 క్వింటాళ్ల వేరుశనగ వచ్చింది. గరిష్టం రూ. 5676, కనిష్టం రూ. 2839, సరాసరి రూ. 3621 ధరలు లభించాయి.

లోక్ అదాలత్‌లో 6,884 కేసులు పరిష్కారం