
ప్రతిభకు ప్రోత్సాహం
నారాయణపేట రూరల్/గద్వాల టౌన్: పేద విద్యార్థులు ఆర్థిక సమస్యలతో విద్యాభ్యాసాన్ని మధ్యలోనే నిలిపివేయకుండా వారిని ప్రోత్సహించేందుకు కేంద్ర ప్రభుత్వం జాతీయ ప్రతిభ ఉపకార వేతనం (ఎన్‌ఎంఎంఎస్) అందిస్తోంది. 2025–2026 విద్యా సంవత్సరానికి సంబంధించి అర్హత పరీక్ష ప్రకటనను ఇటీవల విడుదల చేసింది. ఆన్‌లైన్ దరఖాస్తు ప్రక్రియ ప్రారంభంకాగా.. అక్టోబర్ 6 వరకు అవకాశం కల్పించింది. నవంబర్ 23న ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా పరీక్ష నిర్వహించేందుకు విద్యాశాఖ సిద్ధమైంది. ఇందులో ఎంపికై తే తొమ్మిదో తరగతి నుంచి 12వ తరగతి వరకు నాలుగేళ్ల పాటు ఏటా రూ.12 వేల చొప్పున మొత్తం రూ.48 వేలు విద్యార్థుల బ్యాంకు ఖాతాలో జమవుతాయి.
అర్హత..
8వ తరగతి చదువుతున్న విద్యార్థులు పరీక్ష రాసేందుకు అర్హులు. ఏడోతరగతి పరీక్షలో 55 శాతం కంటే ఎక్కువ మార్కులు సాధించి ఉండాలి. ఎస్సీ, ఎస్టీలైతే 50 శాతం మార్కులుంటే సరిపోతుంది. ప్రభుత్వ, మండల పరిషత్, జిల్లా పరిషత్, ఎయిడెడ్ పాఠశాలలు, హాస్టల్ సౌకర్యం లేని ఆదర్శ పాఠశాల విద్యార్థులు దరఖాస్తు చేసుకోవచ్చు. ఓసీ, బీసీ విద్యార్థులు రూ.100, ఎస్సీ, ఎస్టీ, దివ్యాంగులు రూ.50 ఫీజు చెల్లించాలి. ప్రధానోపాధ్యాయులు విద్యార్థులను ధ్రువీకరిస్తూ బోనఫైడ్ ఇవ్వాలి. అదేవిధంగా విద్యార్థి తల్లిదండ్రుల వార్షిక ఆదాయం రూ.3.50 లక్షల్లోపు ఉండాలి.
పరీక్ష విధానం..
మల్టీపుల్ ఛాయిస్ విధానంలో ప్రశ్నలుంటాయి. మెంటలెబిలిటీ (ఎంఏటీ), లాస్టిక్ ఎబిలిటీ (ఎస్‌ఏటీ), ఏడు, ఎనిమిదో తరగతికి సంబంధించిన గణితం, సామాన్య శాస్త్రం, సాంఘిక శాస్త్రం పాఠ్యాంశాలకు సంబంధించిన ప్రశ్నలు ఉంటాయి. పరీక్షలో సాధించిన మెరిట్ ఆధారంగా ఎంపిక ప్రక్రియ జరుగుతుంది. పూర్తి వివరాలకు బీఎస్‌ఈ తెలంగాణ వెబ్‌సైట్‌ను పరిశీలించాలి.
బాలురు 2,973
బాలికలు 2,621
నవంబర్ 23న ఎన్‌ఎంఎంఎస్ పరీక్ష
ఎంపికై తే ఏటా రూ.12 వేల ఉపకార వేతనం
ప్రతిభ చాటితే నాలుగేళ్ల పాటు అందజేత
దరఖాస్తునకు అక్టోబర్ 6 వరకు అవకాశం
8వ తరగతి విద్యార్థులు
5,594