
పంట సాగు వివరాలు నమోదు చేయాలి
మానవపాడు: మండలంలోని జల్లాపురం గ్రామంలో గురువారం పంట నమోదు కార్యక్రమంలో భాగంగా జిల్లా వ్యవసాయ అధికారి సక్రియానాయక్ పంట పొలాలను పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. మండలంలోని వ్యవసాయ విస్తరణ అధికారులు చేసిన పంటల బుకింగ్ వివరాలు, పొలం వద్ద తీసిన ఫొటోలు వివరాలను పరిశీలించి ధృవీకరించారు. ప్రతి వ్యవసాయ విస్తరణ అధికారి పరిదిలోని 2000 ఎకరాల్లో విస్తీర్ణనానికి డిజిటల్ పంట బుకింగ్ చేయాల్సి ఉంటుందని తెలిపారు. ఈ ప్రక్రియలో భాగంగా ఏఈఓ తప్పనిసరిగా ప్రత్యక్షంగా పొలం వద్దకు వెళ్లి, అక్కడి పంటల ఫొటోలు డీసీఎస్ యాప్‌లో అప్‌లోడ్ చేయాలని, ఫొటోలు తీసేటప్పుడు లాటిట్యూట్, లాంగిట్యుడ్ వివరాలు తప్పనిసరిగా నమోదు చేయాలన్నారు. మండలంలో పత్తి పంట 19800, మిర్చి 4000, కంది 1950, మొక్కజొన్న 750, వరి 221ఎకరాలలో మండల వ్యాప్తంగా పంటలను రైతులు సాగుచేస్తున్నారని తెలిపారు. ఈ కార్యక్రమంలో మండల వ్యవసాయ అధికారి ప్రదీప్‌కుమార్, వ్యవసాయ విస్తరణ అధికారులు, రైతులు తదితరులు పాల్గొన్నారు.