
తప్పని యూరియా తిప్పలు
గట్టు: రైతులకు యూరియా కష్టాలు తీరడం లేదు. యూరియా కోసం రైతులు తెల్లవారుజామున నుంచి చీకటి పడే దాకా పీఏసీఎస్ దగ్గర పడిగాపులు పడుతున్నారు. గురువారం యూరియా కోసం రైతులు ఉదయమే గట్టులోని పీఏసీఎస్ వద్దకు చేరుకున్నారు. పట్టాదారు పాసుపుస్తకాలు, జిరాక్స్ పత్రాలతో కూడిన కవర్లు క్యూలో పెట్టి ఎదురుచూశారు. గత నెల 30న టోకెన్లు అందుకున్న వారికి మాత్రమే గురువారం యూరియా బస్తాలను అందజేశారు. మొత్తం 600 బస్తాలను అందించినట్లు తెలిపారు. ఇక తాజాగా టోకెన్లు అందుకున్న రైతులకు వచ్చే సోమ, మంగళవారాల్లో యూరియా బస్తాలను అందిస్తామని పీఏసీఎస్ అధికారులు తెలిపారు. వ్యవసాయ అధికారులు, పోలీసుల సహకారంతో రైతులకు టోకెన్లు అందజేశారు. ఇదిలాఉండగా, రోజుల తరబడి యూరియా కోసం ఎదురుచూసే పరిస్థితి నెలకొన్నట్లు రైతులు వాపోయారు.