గద్వాలన్యూటౌన్: గద్వాల ప్రాంతంలో ప్రసిద్ధిగాంచిన జములమ్మ ఆలయ హుండీని శుక్రవారం లెక్కించారు. దేవాదాయ ధర్మాదాయ శాఖ పరిశీలకురాలు వెంకటేశ్వరి, ఆలయ ఈఓ పురంధర్‌కుమార్, చైర్మన్ వెంకట్రాములు యూనియన్ బ్యాంక్ అధికారుల సమక్షంలో భక్తులు నాలుగు నెలలకుగాను హుండీ లెక్కింపు నిర్వహించారు. హుండీ ద్వారా నగదు రూ. 29.34లక్షలతో పాటు అర కేజీ మిశ్రమ వెండి ఆలయానికి ఆదాయంగా సమకూరింది. కార్యక్రమంలో ఆలయ కమిటీ సభ్యులు, భక్తులు పాల్గొన్నారు.
వేరుశనగ క్వింటా రూ.5560
గద్వాల వ్యవసాయం: గద్వాల మార్కెట్ యార్డ్‌కు శుక్రవారం 723 క్వింటాళ్ల వేరుశనగ వచ్చింది. ధరల విషయానికి వస్తే గరిష్టం రూ.5560, కనిష్టం రూ. 2270, సరాసరి రూ. 4910 ధర పలికాయి.
అయిజలో మార్కెట్ యార్డు ఏర్పాటు చేయండి
అలంపూర్: అయిజలో కొత్త మార్కెట్ యార్డు ఏర్పాటు చేయాలని వ్యవసాయ రైతు సంక్షేమ కమిషన్ చైర్మన్ కోదండరెడ్డిని ఏఐసీసీ కార్యదర్శి మాజీ ఎమ్మెల్యే సంపత్ కుమార్ కోరారు. హైదరాబాద్‌లో శుక్రవారం ఆయనను కలిసి కొత్త మార్కెట్ యార్డు ఏర్పాటు చేయాలని వినతి పత్రం అందజేసినట్లు తెలిపారు. నియోజకవర్గంలో ప్రస్తుతం ఒక మార్కెట్‌యార్డు మాత్రమే ఉందని, కొత్తగా వచ్చిన నిబంధనల మేరకు మరొక మార్కెట్ యార్డు ఏర్పాటు చేయాలని విజ్ఞప్తి చేసినట్లు తెలిపారు. అయిజ పెద్ద మండలం కావడంతో ఈ ప్రాంతంలో ఉన్న రైతులు ఏపీలోని కర్నూల్, ఎమ్మిగనూరు, కర్ణాటకలోని రాయచూరుకు వెళ్లాల్సిన పరిస్థితి నెలకొన్నట్లు తెలిపారు. ఈ ప్రాంత రైతులకు ప్రయోజనం జరిగే విధంగా కొత్త మార్కెట్ యార్డును అందుబాటులోకి తేవాలన్నారు. కొత్త మార్కెట్ యార్డు అందుబాటులోకి వస్తే రైతులకు ఎంతో ప్రయోజనం చేకురుతుందన్నారు. అనంతరం చైర్మన్ కోదండరెడ్డిని ఏఐసీసీ కార్యదర్శి శాలువాతో సత్కరించారు. వీరితోపాటు కాంగ్రెస్ రాష్ట్ర అధికార ప్రతినిధి షేక్షావలి ఆచారి, నాయకులు శ్రీరాంరెడ్డి, గోపాల్ రెడ్డి తదితరులు ఉన్నారు.
రాష్ట్ర నీటి హక్కుల
కోసం జంగ్ సైరన్
అలంపూర్: బీఆర్‌ఎస్ అధినేత కేసీఆర్ రాష్ట్ర నీటి హక్కుల కోసం జంగన్ సైరన్ మోగించారని బీఆర్‌ఎస్‌వి జిల్లా కో–ఆర్డీనేటర్ కుర్వ పుల్లయ్య అన్నారు. అలంపూర్, అలంపూర్ చౌరస్తా, మానవపాడులోని కళాశాలలో బీఆర్‌ఎస్‌వి ఆధ్వర్యంలో శుక్రవారం అవగాహన కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా జిల్లా కో–ఆర్డినేటర్ మాట్లాడుతూ.. గోదావరి నదిలో జరుగుతున్న జల దోపిడీని అడ్డుకుందామని, ఏపీ సీఎం చంద్రబాబునాయుడుకు వత్తాసు పలుకుతున్న రేవంత్‌రెడ్డి కుట్రలను తిప్పికొడదామన్నారు. కేసీఆర్ సారథ్యంలో నీళ్లు, నిధులు, నియామకాలే ఏజెండాగా తెలంగాణ ఉద్యమం జరిగిందన్నారు. రాష్ట్ర సాధన సాకరమైన తర్వాత బీఆర్‌ఎస్ హయాంలో తెలంగాణ పచ్చని మణిహారంగా మారిందన్నారు. కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన తర్వాత జల దోపిడీ కొనసాగుతుందన్నారు. ఏపీ సీఎం గోదావరి నుంచి అక్రమంగా 200 టీఎంసీల నీటిని తరలించే కుట్ర జరుగుతుందని ఆరోపించారు. సీఎం రేవంత్‌రెడ్డి అడ్డుకోవడానికి బదులు సహకరించే ప్రయత్నం చేస్తున్నారని విమర్శించారు. గోదావరి, కృష్ణా నదుల యాజమాన్య బోర్డులు, కేంద్ర జల సంఘం అనుమతులు లేకుండా, అపెక్స్ కౌన్సిల్‌లో చర్చ జరగకుండా ప్రాజెక్టులు నిర్మించరాదన్నారు. దీనికి వ్యతిరేకంగా విద్యార్థులు ఉద్యమించాలని కేసీఆర్ దిశానిర్ధేశం చేశారన్నారు. అలాగే, విద్యార్థుల ఫీజు రీయింబర్స్‌మెంట్, స్కాలర్‌షిప్‌లను తక్షణమే విడుదల చేయాలని డిమాండ్ చేశారు. కార్యక్రమంలో బీఆర్‌ఎస్‌వి నాయకులు మద్దిలేటి, బాలరాజు, మాధవ్, యువరాజ్, రేపల్లె చిన్న, రాజు పాల్గొన్నారు.
జములమ్మ హుండీ ఆదాయం రూ.29 లక్షలు
జములమ్మ హుండీ ఆదాయం రూ.29 లక్షలు