
పెండింగ్ కేసుల పరిష్కారానికి కృషి
జెడ్పీసెంటర్ (మహబూబ్‌నగర్): వివిధ ప్రభుత్వ శాఖలలో పనిచేసి పదవీ విరమణ పొందిన ఉద్యోగుల పెండింగ్‌లో ఉన్న పెన్షన్, జీపీఎఫ్ ఫైనల్ విత్ డ్రాయల్ కేసుల సత్వర పరిష్కారానికి పెన్షన్ అదాలత్ నిర్వహించి పరిష్కరిస్తామని రాష్ట్ర ప్రిన్సిపల్ అకౌంటెంట్ జనరల్ చందా పండిత్ అన్నారు. శుక్రవారం మహబూబ్‌నగర్ కలెక్టరేట్ సమావేశ మందిరంలో అకౌంటెంట్ జనరల్ (ఏఅండ్‌ఈ), కలెక్టరేట్ సంయుక్త ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన పెన్షన్, జీపీఎఫ్ అదాలత్‌లో కలెక్టర్ విజయేందిరతో కలిసి ఆమె పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ పదవీ విరమణ పొందిన ఉద్యోగులకు పెన్షన్లు, జీపీఎఫ్ అందజేతలో ఏమైనా సందేశాలు ఉంటే అదాలత్‌లో నివృత్తి చేసుకోవాలని సూచించారు. పదవీ విరమణ పొందిన ఉద్యోగుల పెన్షన్ పత్రాలు, సాధారణ భవిష్య నిధి పత్రాలు అందిన వెంటనే వాటిని పరిశీలించి మంజూరు ఉత్తర్వులు అందిస్తామన్నారు. ప్రభుత్వ శాఖలలో పదవీ విరమణ పొందిన ఉద్యోగులకు పెన్షన్, జీపీఎఫ్ ఫైనల్ విత్ డ్రాయల్ ఉత్తర్వులు అందేలా ప్రత్యేక దృష్టిపెట్టామన్నారు. కలెక్టర్ విజయేందిర మాట్లాడుతూ పింఛన్ ప్రభుత్వ ఉద్యోగుల హక్కు, పదవీ విరమణ చేసిన రోజున ఉద్యోగులకు పెన్షన్ ఉత్తర్వులు అందేలా చూడాలన్నారు. అలాగే పెన్షన్ అదాలత్ ఏర్పాటు చేసి పెన్షన్ సమస్యలను ఎప్పటికప్పుడు పరిష్కరించాలని కోరారు. కాగా.. పెన్షన్ అదాలత్‌లో 116 అధికారులు, 50 మంది పెన్షనర్లు, 28 మంది చందాదారులు పాల్గొన్నారు.
మంజూరు పత్రాలు, ప్రొసీడింగ్స్ అందజేత..
ప్రిన్సిపల్ అకౌంటెంట్ జనరల్‌తో కలిసి కలెక్టర్ 20 మందికి పెన్షన్ మంజూరు పత్రాలు, 16 జీపీఎఫ్ ఆథరైజేషన్ ప్రొసీడింగ్స్‌లను రిటైర్డ్ ఉద్యోగులకు అందజేశారు.
పదవీ విరమణ పొందనున్న ఉద్యోగులకు త్వరగా పేమెంట్ ఆర్డర్ అందజేతకు చర్యలు
రాష్ట్ర ప్రిన్సిపల్ అకౌంటెంట్ జనరల్ చందా పండిత్