
లక్ష్యం.. నిర్దేశం
ఆర్థికంగా చేయూత..
ప్రతి ఆర్థిక సంవత్సరంలో వివిధ రంగాల్లో అర్హులైన లబ్ధిదారులకు రుణాలు అందించి.. ఆర్థికంగా చేయూత అందించడంతో పాటు పరోక్షంగా ఉద్యోగ, ఉపాధి అవకాశాలు మెరుగుపరిచేందుకు జిల్లా లీడ్ బ్యాంక్ అధికారులు వార్షిక రుణ ప్రణాళిక రూపొందించారు. ఇటీవల కలెక్టర్ అధ్యక్షతన జరిగిన డీసీసీ సమావేశంలో 2025–26 ఆర్థిక సంవత్సర రుణ ప్రణాళికను ఖరారు చేశారు. అయితే 2024–25 ఆర్థిక సంవత్సరానికి సంబంధించి వివిద రంగాల్లో లబ్ధిదారులకు దాదాపు రూ. 5వేల కోట్ల రుణాలు అందించాలని లక్ష్యంగా నిర్దేశించగా.. ఇందులో 90శాతం పైగా అందించారు.
● విద్య, వ్యవసాయం, వ్యాపారాలు, గృహనిర్మాణాలకు ఆర్థిక తోడ్పాటు
● జిల్లాలో 2,01,300 మందికి రూ. 6472.29 కోట్లు అందించేలా కార్యాచరణ
● లక్ష్యం మేరకు రుణాలు అందిస్తేనే ప్రయోజనం
జిల్లాలో రుణ లక్ష్యం ఇలా..
●
టార్గెట్ మేరకు..
2024–25 ఆర్థిక సంవత్సరానికి సంబంధించి అర్హులైన లబ్ధిదారులకు లక్ష్యం మేరకు రుణాలు అందించాం. ఇటీవల జరిగిన డీసీసీ సమావేశంలో 2025–26 వార్షిక రుణ ప్రణాళికను ఆమోదించారు. ఆయా రంగాలకు ఉన్న అవసరం మేరకు రుణ లక్ష్యాలను నిర్దేశించాం. ఆయా రంగాల్లో అర్హులైన లబ్ధిదారులకు రుణాలు అందేలా చర్యలు తీసుకుంటాం.
– శ్రీనివాసరావు, ఎల్‌డీఎం
గద్వాలన్యూటౌన్: జిల్లాలో వివిధ రంగాలు, వాటి విభాగాలకు 2025–26 సంవత్సరం అందించాల్సిన రుణాలపై వార్షిక ప్రణాళిక ఖరారైంది. విద్య, వ్యవసాయం, అనుబంధ రంగాలు, గృహనిర్మాణాలు, వివిధ వ్యాపారాలు, సంస్థల నిర్వహణకు అవసరమైన రుణాలను బ్యాంకుల ద్వారా అందించేందుకు పక్కా ప్రణాళిక రూపొందించారు. ఆయా రంగాల్లోని విభాగాల్లో 2,01,300 మంది లబ్ధిదారులకు రూ. 6472.29 కోట్ల రుణాలు అందించాలని లక్ష్యంగా నిర్దేశించారు.
● జిల్లాలో గోదాములు, శీతలీకరణ కేంద్రాల ఏర్పాటు చేయాల్సిన అవసరముంది. వీటి నిర్మాణాల కోసం అవసరమైన వారికి రుణాలు అందించి.. ప్రోత్సహించాల్సిన బాధ్యత బ్యాంకర్లపై ఉంది. ఏళ్ల తరబడి పాడిని నమ్ముకొని జీవనం సాగిస్తున్న రైతులకు విరివిగా రుణాలు అందిస్తేనే జిల్లాలో పాలు, పాలపదార్థాల ఉత్పత్తి పెరిగి.. రైతుల ఆర్థిక పరిస్థితి మెరుగుపడుతుంది.
● ఇక పౌల్ట్రీ రంగంపై ఎంతో మంది ఔత్సాహికులు ఉన్నప్పటికీ తగినంత పెట్టుబడి లేక ముందుకు రాలేకపోతున్నారు. ఇలాంటి వారికి రుణాలు అందించి.. పౌల్ట్రీ రంగాన్ని జిల్లాలో అభివృద్ధి చేయాల్సిన అవసరం ఉంది.
● జిల్లాకు చెందిన చాలా మంది విద్యార్థులు, యువత ఉన్నత చదువుల కోసం విదేశాలకు వెళ్లాలని ఉన్నా.. ఆర్థిక పరిస్థితుల కారణంగా వెళ్లలేకపోతున్నారు. ఇలాంటి విద్యార్థులు, యువతకు బ్యాంకర్లు రుణాలు అందిస్తేనే వారు ఉన్నత చదువులు చదుకొని అనుకున్న లక్ష్యాన్ని చేరుకోగలుతారు.
జిల్లాలో ఇదీ పరిస్థితి..
వ్యవసాయ ఆధారిత జిల్లా అయిన నడిగడ్డ రెండు జీవనదుల నడుమ ఉంది. జిల్లాలో మొత్తం 1,76,860 మంది రైతులు ఉండగా.. వీరిలో 90శాతం సన్న, చిన్నకారు రైతులే ఉన్నారు. రైతుభరోసా, కిసాన్ సమ్మాన్ యోజన లాంటి పెట్టుబడి సాయం పథకాలు ఉన్నప్పటికీ రైతులకు అన్ని అవసరాలు తీరడం లేదు. వారంతా బ్యాంకులు అందించే పంట రుణాలపైనే ఆధారపడి వ్యవసాయం చేస్తున్నారు. రైతులకు సకాలంలో పంట రుణాలు అందిస్తేనే ప్రయోజనం చేకూరుతుంది.
● ఇక సూక్ష్మ, చిన్న, మధ్యతరహా సంస్థల స్థాపనను ప్రోత్సహించాల్సిన ఆవశ్యకత ఉంది. స్థానికంగా ఉద్యోగ, ఉపాధి అవకాశాలు లేక చాలా మంది నిరుద్యోగ యువత ఇతర ప్రాంతాలకు వెళ్తున్నారు. ఈ నేపథ్యంలో సంస్థల స్థాపనకు ముందుకొచ్చే వారికి రుణాలు అందించడం వల్ల నిరుద్యోగ సమస్య కాస్త తగ్గుతుంది. పునరుత్పాదక రంగానికి రుణాలు అందించి చేయూతనివ్వాలి.
● మధ్యతరగతి కుటుంబాలకు సొంతింటి కల నెరవేర్చుకోవాలని ఉంటుంది. ప్రస్తుత పరిస్థితుల్లో గృహనిర్మాణానికి అవసరమైన వస్తువుల ధరలు బాగా పెరిగాయి. గృహనిర్మాణానికి చేతినిండా డబ్బు ఉంటేనే సాధ్యపడుతుంది. ఈ నేపథ్యంలో బ్యాంకుల ద్వారా రుణాలు పొంది గృహాలు నిర్మించుకోవాలని ప్రయత్నాలు చేస్తున్నారు. అయితే చాలా మందికి గృహనిర్మాణ రుణాలు పొందడంలో ఇక్కట్లు పడుతున్నారు. అర్హులైన వారికి రుణాలు అందించాల్సిన అవసరం ఉంది.
వార్షిక రుణ ప్రణాళిక ఖరారు

లక్ష్యం.. నిర్దేశం