
పరిహారం కోసం రైతుల ఆందోళన
గట్టు: భారత్‌మాల రహదారి నిర్మాణంలో భూములు కోల్పోయిన వారికి రెండో విడత పరిహారం చెల్లించాలని డిమాండ్ చేస్తూ గురువారం రైతులు ఆందోళనకు దిగారు. గంగిమాన్‌దొడ్డి వద్ద నిర్మాణంలో ఉన్న భారత్‌మాల రహదారిపై గట్టు, గంగిమాన్‌దొడ్డి గ్రామాల రైతులు బైఠాయించి పనులను అడ్డుకున్నారు. ఈ సందర్భంగా పలువురు రైతులు మాట్లాడుతూ.. కొత్తగా చేపట్టిన ఆరు వరుసల భారత్‌మాల రహదారి నిర్మాణంలో భూములను కోల్పోయిన తమకు ప్రభుత్వం చాలీచాలని పరిహారం అందించి చేతులు దులుపుకొందన్నారు. తమకు న్యాయమైన పరిహారం అందించి ఆదుకోవాలని ఆందోళన కార్యక్రమాలు చేపట్టడంతో పాటు అధికారులకు విన్నవించినా పట్టించుకోవడం లేదని వాపోయారు. తమకు రెండో విడత పరిహారం అందించే వరకు ఆందోళన విరమించేది లేదని భీష్మించారు. రోడ్డు నిర్మాణం చేపడుతున్న సైట్ ఇన్‌చార్జి అఫ్జల్‌తో పాటు పోలీసులు అక్కడికి చేరుకొని రైతులకు నచ్చజెప్పడంతో ఆందోళన విరమించారు. రైతుల ఆందోళనకు ఎమ్మార్పీఎస్ మండ ల అధ్యక్షుడు ఏసన్న, కాంగ్రెస్ పార్టీ మండల అ ధ్యక్షుడు మహబూబ్ పాషా, రైతులు సంతోష్, వెంకట్రాములు, నర్సింహులు, తిమ్మప్ప పాల్గొన్నారు.