
అధిక ధరలకు ఎరువులు విక్రయిస్తే చర్యలు
అలంపూర్: ఎరువులను అధిక ధరలకు విక్రయిస్తే చర్యలు తప్పవని జిల్లా వ్యవసాయశాఖ అధికారి సక్రియా నాయక్ అన్నారు. అలంపూర్ చౌరస్తాలోని ఎరువుల విక్రయ కేంద్రాల్లో గురువారం ఆయన ఆకస్మిక తనిఖీలు చేపట్టారు. ఈ సందర్భంగా పలు రికార్డులతో పాటు ఎరువుల స్టాక్‌ను పరిశీలించారు. అనంతరం డీఏఓ మాట్లాడుతూ.. అన్ని ఫర్టిలైజర్ దుకాణాల్లో రైతులకు కావాల్సిన ఎరువులు అందుబాటులో ఉన్నాయన్నారు. యూరియా 5052.52 మెట్రిక్ టన్నులు, డీఏపీ 1330.23, ఎంఓపీ 935.58, ఎస్‌ఎస్‌పీ 807.56, కాంప్లెక్స్ ఎరువులు 17734.92 మెట్రిక్ టన్నులు అందుబాటులో ఉన్నట్లు వివరించారు. రైతులకు ఎరువుల స్టాక్, ధరల వివరాలు తెలిసే విధంగా దుకాణాల్లో బోర్డు ఏర్పాటు చేయాలని ఆయన సూచించారు. అదే విధంగా కొనుగోలు చేసిన ఎరువులకు తప్పనిసరిగా రశీదులు ఇవ్వాలన్నారు. ప్రభుత్వ నిబంధనలు పాటించకుండా అధిక ధరలకు ఎరువులు విక్రయిస్తే చట్టప్రకారం కఠిన చర్యలు ఉంటాయని హెచ్చరించారు. డీఏఓ వెంట ఏఓ సీహెచ్ అనిత తదితరులు ఉన్నారు.