
ప్రజలతో స్నేహపూర్వకంగా మెలగాలి : ఎస్పీ
గద్వాల క్రైం: వివిధ సమస్యలపై పోలీస్‌స్టేషన్‌కు వచ్చే ప్రజలతో సిబ్బంది స్నేహ పూర్వకంగా మెలగాలని ఎస్పీ శ్రీనివాసరావు అన్నారు. గురువారం జిల్లా కేంద్రంలోని పట్టణ పోలీస్‌స్టేషన్‌లో ఎస్పీ ఆకస్మిక తనిఖీలు చేపట్టారు. ఈ సందర్భంగా పోలీసు సిబ్బందికి ఆయన పలు సూచనలు చేశారు. .. బాధితుల ఫిర్యాదు మేరకు కేసుల నమోదులో నిర్లక్ష్యం చేయొద్దన్నారు. ఫిర్యాదులపై వేగవంతంగా విచారణ చేపట్టి బాధితులకు పోలీసుశాఖపై నమ్మకం పెంచాలని సూచించారు. పట్టణంలో నిత్యం గస్తీ, పెట్రోలింగ్ నిర్వహించాలని ఆదేశించారు. సైబర్ క్రైమ్స్, మహిళలపై వేధింపులు, లైంగిక దాడులు, మిస్సింగ్ కేసులపై ప్రత్యేక దృష్టిసారించాలన్నారు. రోడ్డు ప్రమాదాల నివారణకు అవసరమైన చర్యలు తీసుకోవాలన్నారు. స్టేషన్ పరిసరాలను శుభ్రంగా ఉంచుకోవాలని సూచించారు. అనంతరం జిల్లా కేంద్రంలో సీసీ కెమెరాల పనితీరుపై ఆరా తీశారు. విధి నిర్వహణలో నిర్లక్ష్యం వహించే సిబ్బందిపై శాఖాపరమైన చర్యలు తప్పవని హెచ్చరించారు. ఎస్పీ వెంట సీఐ శ్రీను, ఎస్‌ఐ కళ్యాణ్‌కుమార్ ఉన్నారు.