
ప్రభుత్వ ఆస్పత్రుల్లో మెరుగైన వైద్యం
గద్వాల: ప్రభుత్వ ఆస్పత్రులకు వచ్చే ప్రజలకు వైద్యులు అందుబాటులో ఉండి మెరుగైన వైద్యం అందించాలని కలెక్టర్ బీఎం సంతోష్ ఆదేశించారు. గురువారం ఐడీఓసీ కాన్ఫరెన్స్ హాలులో సంబంధిత అధికారులతో కలెక్టర్ సమీక్షించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. రాష్ట్ర ప్రభుత్వం వైద్యరంగాన్ని బలోపేతం చేసేందుకు ప్రత్యేకంగా చర్యలు తీసుకుంటుందన్నారు. ముఖ్యంగా ప్రభుత్వ ఆస్పత్రుల్లో ఓపీ శాతం ఎక్కువగా ఉండేలా సేవలు అందించాలని సూచించారు. వైద్యులతో పాటు సిబ్బంది సమయపాలన పాటిస్తూ.. బయోమెట్రిక్ విధానాన్ని తప్పనిసరిగా అమలు చేయాలన్నారు. జిల్లా ఆస్పత్రితో సహా సీహెచ్‌సీలు, పీహెచ్‌సీల్లో ప్రసవాల సంఖ్య పెంచేందుకు చర్యలు తీసుకోవాలన్నారు. సాధారణ ప్రసవాలకు ప్రాధాన్యం ఇవ్వాలన్నారు. ప్రస్తుతం సీజనల్ వ్యాధులు ప్రబలకుండా ముందస్తు చర్యలు చేపట్టాలని ఆదేశించారు. టీబీ ముక్త్‌భారత్‌లో భాగంగా క్షయవ్యాధి నిర్మూలనకు చిత్తశుద్ధితో పనిచేయాలన్నారు. సమావేశంలో డీఎంహెచ్‌ఓ డా.సిద్ధప్ప, ప్రోగ్రాం అధికారులు హెల్త్ సూపర్‌వైజర్లు ఉన్నారు.
ఉన్నతస్థాయిలో నిలిపేది చదువే..
గద్వాలటౌన్: జీవితంలో ఉన్నత స్థితికి చేరాలంటే చదువు ఎంతో ముఖ్యమని.. క్రమశిక్షణ, జిజ్ఞాసతో కూడిన విద్య నేర్చుకున్నప్పుడే సమాజాభివృద్ధి సాధ్యమవుతుందని కలెక్టర్ సంతోష్ అన్నారు. జిల్లా కేంద్రంలోని ప్రభుత్వ బాలుర ఉన్నత పాఠశాల విద్యార్థులకు హెల్పింగ్ హ్యాండ్స్ చారిటబుల్ ట్రస్టు ఆధ్వర్యంలో ఉచితంగా స్టడీ మెటీరియల్స్ పంపిణీ చేశారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ.. చదువును కష్టంగా భావించకుండా ఇష్టంగా చదివితేనే అద్భుతాలు సృష్టిస్తారన్నారు. ప్రతి విద్యార్థి వ్యక్తిత్వాన్ని వికసింపజేసుకోవాలని సూచించారు. విద్యార్థులను లక్ష్యసాధన దిశగా ప్రోత్సహించాల్సిన బాధ్యత ఉపాధ్యాయులదేనని అన్నారు. పదో తరగతి విద్యార్థులు పాఠ్యాంశాలపై పట్టు సాధించి ఉత్తమ ఫలితాలు సాధించాలన్నారు. కాగా, కామన్వెల్త్ ఆఫ్ నేషన్స్, హార్ట్‌ఫుల్ నెస్ ఎడ్యుకేషన్ ట్రస్టు నుంచి ప్రభుత్వ బాలుర ఉన్నత పాఠశాలకు ప్రశంసలు రావడంపై ఉపాధ్యాయ బృందాన్ని కలెక్టర్ ప్రత్యేకంగా అభినందించారు. కార్యక్రమంలో ట్రస్టు వ్యవస్థాపకురాలు మమత, రత్నసింహారెడ్డి, ఎంఈఓ శ్రీనివాస్‌గౌడ్, హెచ్‌ఎం రేణుకాదేవి, కృష్ణకుమార్, మహేశ్వర్‌రెడ్డి, కృష్ణవర్ధన్‌రెడ్డి పాల్గొన్నారు.
వైద్యులు, సిబ్బంది సమయపాలన పాటించాలి
సాధారణ ప్రసవాల సంఖ్య పెంచాలి
కలెక్టర్ బీఎం సంతోష్