
కమ్యూనిస్టులతోనే సమస్యలు పరిష్కారం
ఉండవెల్లి: కమ్యూనిస్టుల పోరాటాలతోనే ప్రజా సమస్యలు పరిష్కారమవుతున్నాయని సీపీఐ జాతీయ మాజీ ప్రధాన కార్యదర్శి, మాజీ ఎంపీ సురవరం సుధాకర్‌రెడ్డి అన్నారు. సోమవారం ఉండవెల్లి మండలం కంచుపాడులోని తన నివాసంలో ఏర్పాటుచేసిన సమావేశంలో ఆయన మాట్లాడారు. సమాజంలో అన్యాయాలు, దోపిడీని అరికట్టేందుకు కమ్యూనిజమే ఏకై క మార్గమన్నారు. కమ్యూనిజానికి మించిన సిద్ధాంతం లేదన్నారు. ప్రజా సమస్యల పరిష్కారం కోసం సీపీఐ నిరంతరం పోరాడుతుందన్నారు. దేశంలోని 80 శాతం హిందువులకు కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం ఏం చేసిందో చెప్పాలని డిమాండ్ చేశారు. కేవలం ఓట్ల కోసమే హిందువులను ఏకం చేస్తున్నారన్నారు. పాలకులు మతవిద్వేషాలను రెచ్చగొట్టే విధానాలను మానుకోవాలని హితవు పలికారు. అనంతరం మండల కమిటీ సభ్యులు ఆయనను ఘనంగా సన్మానించారు. కార్యక్రమంలో సీపీఐ జాతీయ నాయకురాలు విజయలక్ష్మి, జిల్లా అధ్యక్షుడు ఆంజనేయులు, ఆశన్న, రంగన్న పాల్గొన్నారు.