
నిబంధనలు ఉల్లంఘిస్తే చర్యలు తప్పవు
అయిజ: రసాయన ఎరువులు విక్రయించే వ్యాపారులు ప్రభుత్వ నిబంధనలు ఉల్లంఘిస్తే చర్యలు తప్పవని జిల్లా వ్యవసాయ అధికారి సక్రియానాయక్ అన్నారు. మంగళవారం మండలంలోని ఎక్లాస్‌పురంలో మండల వ్యవసాయ అధికారి జనార్ధన్ ఆధ్వర్యంలో ఫర్టిలైజర్స్, ఇతర వ్యాపార దుకాణ యజమానులతో పత్య్రేక సమాశం నిర్వహించారు. కార్యక్రమానికి ముఖ్య అతిథిగా డీఏఓ హాజరై మాట్లాడారు. ఎమ్మార్పీ ధరలకే రసాయన ఎరువులు విక్రయించాలని, స్టాక్ బోర్డ్ ఏర్పాటు చేసి రాసిపెట్టాలని, వివిధ రసాయన ఎరువుల ధరలను బోర్డుపై సూచించాలని అన్నారు. స్టాక్ రిపోర్ట్ ప్రతిరోజు వ్యవసాయ అధికారులకు తెలియజేయాలని, లైసెన్స్ ఉన్న దుకాణాలు, గోదాముల్లోనే సరుకులు నిల్వ చేసుకోవాలని అన్నారు. గడువు ముగిసిన వెంటనే రెన్యూవల్ చేసుకోవాలని, రాష్ట్రానికి చెందిన రైతులకు మాత్రమే ఫర్టిలైజర్స్ విక్రయించాలని ఆదేశాలు జారీ చేశా రు. కార్యక్రమంలో మండలంలోని వివిధ వ్యా పార దుకాణాల యజమానులు పాల్గొన్నారు.
ఆయిల్‌పాం సాగుతో అధిక లాభాలు
ధరూరు: తక్కువ నీటితో ఎక్కువ పంటను సాగు చేసుకోవడమే కాకుండా, ఆయిల్‌పాంసాగుతో మంచి లాభాలు పొందవచ్చునని జిల్లా హార్టికల్చర్ అధికారి అక్బర్ అన్నారు. మంగళవారం మండల పరిదిలోని ఉప్పేరు గ్రామంలోని రైతు వేదికలో రైతులకు పామాయిల్ సాగులో యాజమాన్య పద్దతులు, దాని వల్ల కలిగే ప్రయోజనాలను వివరించారు. పండిన పంటను విక్రయించడానికి అనువుగా ఉండడం వల్ల రైతులు ఈ పంట సాగుపై దృష్టి సారిస్తే బాగుంటుందని, అలాగే సబ్సిడీపై అందించే డ్రిప్‌పై అవగాహన కల్పించారు. ప్రతి రైతు ఈ అవకాశాలను సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. రాజశేఖర్, ఏఈఓ క్రిష్ణయ్య, రైతులు తదితరులు పాల్గొన్నారు.
రామన్‌పాడులో
నిలకడగా నీటిమట్టం
మదనాపురం: మండలంలోని రామన్‌పాడు జలాశయంలో మంగళవారం 1,018 అడుగుల నీటిమట్టం ఉన్నట్లు ఏఈ వరప్రసాద్ తెలిపారు. జూరాల ఎడమ, కుడి కాల్వల్లో 550 క్యూసెక్కులు, సమాంతర కాల్వలో 344 క్యూసెక్కుల వరద కొనసాగుతుందన్నారు. రామన్‌పాడు జలాశయం నుంచి ఎన్టీఆర్ కాల్వకు 609 క్యూసెక్కులు, కుడి, ఎడమ కాల్వలకు 40 క్యూసెక్కులు, వివిధ ఎత్తిపోతల పథకాలకు 399 క్యూసెక్కులు, తాగునీటి అవసరాలకు 20 క్యూసెక్కుల నీటిని వినియోగిస్తున్నట్లు వివరించారు.

నిబంధనలు ఉల్లంఘిస్తే చర్యలు తప్పవు