
అభివృద్ధి, సంక్షేమ ఫలాలు క్షేత్రస్థాయికి చేరాలి
గద్వాలటౌన్: కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు అమలు చేస్తున్న అభివృద్ధి, సంక్షేమ ఫలాలు క్షేత్రస్థాయిలో లబ్ధిదారులకు చేరేలా అధికారులు చర్యలు తీసుకోవాలని దిశ కమిటీ చైర్మన్, ఎంపి మల్లురవి అన్నారు. బుధవారం కలెక్టరేట్ సమావేశ మందిరంలో జరిగిన దిశ కమిటీ సమావేశానికి ఎంపీ అధ్యక్షత వహించి మాట్లాడారు. కేంద్రం నిధులు, రాష్ట్ర ప్రభుత్వ వాటాలతో కొనసాగుతున్న పథకాలు ఎలాంటి లోపాలు లేకుండా అమలు చేయాలన్నారు. నీతి ఆయోగ్ దేశ వ్యాప్తంగా టాప్–5 ర్యాంకింగ్‌లో గట్టు బ్లాక్ స్థానాన్ని సాధించడంపై అధికారుల కృషిని ప్రశంసించారు. బ్యాంకర్లు లక్ష్యం మేరకు అన్ని రంగాలకు విరివిరిగా రుణాలను అందించాలని సూచించారు. ఎర్రవల్లి, ధరూర్ మండల కేంద్రాలలో కొత్తగా ఎస్‌బీఐ బ్రాంచ్‌లను ఏర్పాటు చేయాలని ఆదేశించారు. డిజిటల్ లైబ్రెరీ ఏర్పాటుకు బ్యాంకర్లు సత్వర చర్యలు తీసు కోవాలన్నారు. గత మూడు నెలల కాలంలో ఉపాధి హామీ పథకం కింద 2,074 పని దినాలు కల్పించి రూ.14.45 కోట్ల కూలీలకు దినసరి భత్యం అందించామన్నారు.
కోటి మందిని కోటీశ్వరులను చేయడమే లక్ష్యం
కోటి మంది మహిళలను కోటీశ్వరులను చేయాలనే లక్ష్యంతో మహిళా శక్తి పథకం కింద పెట్రోల్ బంకులు, సోలార్ పవర్ యూనిట్లను ఏర్పాటు చేస్తున్నామని వివరించారు. వనమహోత్సవం కింద నర్సరీలు, ప్లాంటింగ్, ఫిట్టింగ్, మెయింటెనెన్స్ తదితర పనులు చేపట్టడం జరిగిందని, వ్యవసాయ శాఖలో ఆరు వేల మంది రైతుల పంట పొలాల మట్టి నమూనాలను సేకరించి సాయిల్ హెల్త్ కింద కార్డులు అందజేశామన్నారు. వైద్యఆరోగ్యశాఖ ఆధ్వర్యంలో ఎన్‌సీడీ కింద మహిళలకు అవసరమైన మందులు అందజేయడం జరుగుతుందని పేర్కొన్నారు. అన్ని పాఠశాలలో కొత్త మెనూ ప్రకారం విద్యార్థులకు నాణ్యమైన మధ్యాహ్నా భోజనాన్ని అందించాలని సూచించారు. శిథిలావస్థలో ఉన్న పాత పాఠశాల భవనాలకు మరమ్మత్తులు చేపట్టాలన్నారు. పీఎం గ్రామ సడక్ యోజన కింద పెండింగ్‌లో ఉన్న రహదారి పనులను వెంటనే పూర్తి చేయాలని ఆదేశించారు. అన్ని శాఖల అధికారులు పరస్పర సహకారంతో ప్రతిపాదించిన లక్ష్యాలను సాధించాలన్నారు. అభివృద్ధి, సంక్షేమ పథకాలను అమలు చేసే దిశగా పనిచేయాలని సూచించారు. ఈ సందర్భంగా ఆయా శాఖల ద్వారా చేపట్టిన అభివృద్ధి పనులను అధికారులు వివరించారు. అంతకుముందు కలెక్టర్ సంతోష్ మాట్లాడారు. జిల్లాలో మొత్తం 40 శాఖల ద్వారా చేపడుతున్న కార్యక్రమాలను ఎంపీ సమీక్షించడం జరుగుతుందన్నారు. సమావేశంలో అలంపూర్ ఎమ్మెల్యే విజయుడు, డీసీసీబీ చైర్మన్ విష్ణువర్ధన్‌రెడ్డి, అడిషనల్ కలెక్టర్లు లక్ష్మినారాయణ, నర్సింగరావు, జిల్లా గ్రంథాలయ చైర్మన్ శ్రీనివాసులు, దిశ కమిటీ సభ్యులు సరిత, శంకర్, గిరిబాబు, రాజు తదితరులు పాల్గొన్నారు.
సమష్టి కృషితోనే ‘నీతి’ ఆయోగ్’లో
గట్టు మెరుగైన ర్యాంక్
ఎంపీ ముల్లురవి