
విద్యారంగ సమస్యల పరిష్కారానికి పోరాటం
గద్వాల టౌన్: అఖిల భారతీయ విద్యార్థి పరిషత్ (ఏబీవీపీ) ఆవిర్భావ దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు. బుధవారం ఏబీవీపీ ఆధ్వర్యంలో భారీ ర్యాలీ నిర్వహించారు. అనంతరం స్థానిక రామనందతీర్థా చౌరస్తాలో ఏర్పాటు చేసిన ఏబీవీపీ జెండాను వరల్డ్ ఆర్గనైజింగ్ ఆఫ్ స్టూడెంట్ అండ్ యూత్ నేషనల్ కన్వీనర్ చలమాల నిఖిత ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఆమె విద్యార్థులనుద్దేశించి మాట్లాడారు. జాతీయ వాద సమస్యలతో పాటు విద్యారంగ, ఉపాధ్యాయ సమస్యల పరిష్కారానికి నిరంతరం పోరాడుతున్న ఏబీవీపీ దేశంలో గణనీయమైన ముద్ర వేసుకుందన్నారు. 450 యూనివర్సిటీల్లో విద్యార్థులను దేశభక్తులుగా మారుస్తూ సుభాష్‌సంద్రబోస్ తదితర దేశభక్తుల స్ఫూర్తితో దేశ సేవకు అరవిళ కృషి చేస్తున్న ఏబీవీపీకి విద్యార్థి లోకం అండగా ఉండాలన్నారు. ఏబీవీపీ చేస్తున్న పోరాటాల్లో విద్యార్థులు భాగస్వాములై నవభారత నిర్మాణానికి పాటుపడాలని కోరారు. కార్యక్రమంలో ఏబీవీపీ నాయకులు కావలి ఆంజనేయులు, నరేష్ పటేల్, రఘువంశీ, తేజ, సురేష్, నరేష్, సాయిసత్యరెడ్డి, నితన్, రమేష్, సూరజ్, నవీన్, తారక్, పూర్వ విద్యార్థులు తిరుమలేష్, లక్ష్మిపుత్రశ్రీనివాస్, గణేష్ తదితరులు పాల్గొన్నారు.