
ఫిర్యాదుల పరిష్కారంలో నిర్లక్ష్యం వద్దు
మల్దకల్: పోలీసుస్టేషనుకు వచ్చే వివిధ ఫిర్యాదుల పరిష్కారంలో నిర్లక్ష్యం చేస్తే ఉపేక్షించేది లేదని ఎస్పీ శ్రీనివాసరావు పోలీసు సిబ్బందిని హెచ్చరించారు. బుధవారం మల్దకల్ పోలీసుస్టేషన్‌ను ఎస్పీ ఆకస్మికంగా తనిఖీ చేశారు. వివిధ కేసులకు సంబంధించిన రికార్డులను పరిశీలించారు. పోలీసుస్టేషనుకు వచ్చే కేసుల పరిష్కారంతో పాటు సైబర్ నేరాలు, అన్‌లైన్ మోసాలు, మూడనమ్మకాలు, బాల్యవివాహాలపై ప్రజలకు అవగాహన కల్పించాలన్నారు. ప్రజల ప్రాణ రక్షణే ప్రథమ కర్తవ్యంగా విధులు నిర్వర్తించాలని, ప్రజాసమస్యలను పరిష్కరించేందుకు ఎల్లవేళలా అందుబాటులో ఉండాలన్నారు. పోలీసుస్టేషన్‌కు వచ్చే వారి పట్ల మర్యాదగా వ్యవహరించాలని, పోలీసుసిబ్బంది వ్యాయామం, యోగా, ధ్యానం, వాకింగ్ చేస్తూ ఆరోగ్యాన్ని కాపాడుకోవాలని సూచించారు. రాత్రి వేళల్లో పెట్రోలింగ్‌ను ముమ్మరం చేయాలన్నారు. సీఐ టంగటూరు శీను , ఎస్‌ఐ నందికర్, సిబ్బంది పాల్గొన్నారు.