
ఆదిశిలా క్షేత్రంలో భక్తుల ప్రత్యేక పూజలు
మల్దకల్: ఆదిశిలా క్షేత్రమైన స్వయంభూ లక్ష్మీవెంకటేశ్వరస్వామి ఆలయంలో శనివారం భక్తులు ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈసందర్భంగా ఆలయ అర్చకులు అభిషేకాలు నిర్వహించి భక్తులకు తీర్థప్రసాదాలు అందజేశారు. అదే విధంగా సద్దలోనిపల్లి కృష్ణస్వామి, కుర్తిరావులచెర్వు గట్టు తిమ్మప్ప, శేషంపల్లి శివసీతారామస్వామి, చర్లగార్లపాడు వెంకటేశ్వరస్వామి ఆలయాల్లో భక్తులు ప్రత్యేక పూజలు నిర్వహించారు. అలాగే కొంత మంది భక్తులు స్వామి వారికి దాసంగాలు పెట్టి నైవేద్యాలు సమర్పించి మొక్కులు తీర్చుకున్నారు. కార్యక్రమంలో ఆలయ చైర్మన్ ప్రహ్లదరావు, ఆలయ అర్చకులు రమేషాచారి, మధుసూదనాచారి, రవిచారిలు సిబ్బంది గురునాథ్, ఉరుకుందు, శ్రీను, రంగస్వామి, శివమ్మ, కృష్ణ, తదితరులు ఉన్నారు.
ఉపాధ్యాయ పోస్టులకు దరఖాస్తుల ఆహ్వానం
మహబూబ్‌నగర్ మున్సిపాలిటీ: జిల్లాలోని మూడు బాలికల, రెండు బాలుర పాఠశాలలు/కళాశాలల్లో ఖాళీగా ఉన్న ఉపాధ్యాయ పోస్టులకు అర్హుల నుంచి దరఖాస్తులను ఆహ్వానిస్తున్నామని ప్రాంతీయ అధికారిణి ఫ్లోరెన్స్‌రాణి ఒక ప్రకటనలో తెలిపారు. సంబంధిత సబ్జెక్టులలో పీజీ, బీఈడీ పూర్తి చేసి ఆసక్తి, అనుభవం కలిగిన అభ్యర్థులే అర్హులని పేర్కొన్నారు. ఈనెల 26వ తేదీ ఉదయం పది నుంచి మధ్యాహ్నం రెండు గంటల వరకు రాంరెడ్డిగూడెంలోని బాలికల సాంఘిక సంక్షేమ గురుకులంలో నిర్వహించే డెమోకు హాజరుకావాల్సి ఉంటుందని పేర్కొన్నారు. కాగా బాలికల కళాశాలల్లో తెలుగు రెండు, ఇంగ్లిష్, మ్యాథ్స్, బాటనీ, ఫిజిక్స్, కామర్స్, సివిక్స్, ఎకనామిక్స్‌లో ఒక్కో పోస్టు తాత్కాలిక పద్ధతిన భర్తీ చేయనున్నామని వివరించారు. ఇక పాఠశాలల్లో హిందీ, మ్యాథ్స్, బయో సైన్స్‌లో మూడు చొప్పున, తెలుగు, ఇంగ్లిష్, సోషల్ స్టడీస్, పీఈటీ రెండు చొప్పున, ఫిజికల్ సైన్స్ ఒక పోస్టు ఖాళీగా ఉన్నాయని, బాలుర కళాశాలల్లో ఇంగ్లిష్ రెండు, బాటనీ, జువాలజీ, కెమిస్ట్రీ ఒక్కొక్కటి చొప్పున; పాఠశాలల్లో బయోసైన్స్ రెండు, ఇంగ్లిష్ ఒక పోస్టు ఖాళీగా ఉన్నాయని వెల్లడించారు.
30న ఇంటర్వ్యూలు
పాలమూరు: జిల్లా ఆరోగ్యశాఖ పరిధిలోని ప్రధానమంత్రి జన్‌జాతి ఆదివాసి న్యాయ మహా అభియాన్ పథకం కింద కాంట్రాక్ట్ పద్ధతిలో ఖాళీలు భర్తీ చేస్తున్నట్లు జిల్లా వైద్యారోగ్యశాఖ డాక్టర్ కృష్ణ శనివారం ఒక ప్రకటనలో తెలిపారు. ఒకటి మెడికల్ ఆఫీసర్, ఒక ల్యాబ్ టెక్నీషియన్, ఒకటి పారా మెడికల్ అసిస్టెంట్ పోస్టులను ఒక ఏడాది పాటు కాంట్రాక్ట్ పద్ధతిన తీసుకోనున్నట్లు పేర్కొన్నారు. ఈనెల 30న డీఎంహెచ్‌ఓ కార్యాలయంలో ఇంటర్వ్యూ నిర్వహిస్తున్నామని, అర్హులైన బలహీన గిరిజన అభ్యర్థులు హాజరుకావాలని సూచించారు.
రేపు గిరిజన విద్యార్థులకు స్పాట్ కౌన్సెలింగ్
మహబూబ్‌నగర్ మున్సిపాలిటీ: ఉమ్మడి మహబూబ్‌నగర్ జిల్లాలోని బాలానగర్, కల్వకుర్తిలోని తెలంగాణ గిరిజన ఏకలవ్య మోడల్ రెసిడెన్షియల్ పాఠశాల (టీజీఈఎంఆర్‌ఎస్– కాలేజ్ ఆఫ్ ఎక్స్‌లెన్స్)ల్లో ఇంటర్ మొదటి సంవత్సరంలో మిగిలిన సీట్లకు ఈనెల 26న స్పాట్ కౌన్సెలింగ్ నిర్వహించనున్నామని జీటీ గురుకులం ప్రాంతీయ సమన్వయ అధికారి కె.సుధాకర్ ఒక ప్రకటనలో తెలిపారు. ఎంపీసీ, బీపీసీ, సీఈసీలలో సీబీఎస్‌ఈ సిలబస్‌కు సంబంధించి ఈ ఖాళీలు ఉన్నాయని పేర్కొన్నారు. పదో తరగతిలో ఎక్కువ మార్కులు పొందిన గిరిజన విద్యార్థులను ఎంపిక చేస్తామని తెలిపారు. సోమవారం ఉదయం పది గంటలకల్లా మహబూబ్‌నగర్ జిల్లా బాలానగర్‌లోని టీజీఈఎంఆర్‌ఎస్‌లో అన్ని ఒరిజినల్ ధ్రువపత్రాలతో పాటు ఒక సెట్ జిరాక్స్, ఐదు పాస్‌పోర్ట్ సైజు ఫొటోలను వెంట తెచ్చుకోవాలని, పూర్తి వివరాలకు ఫోన్ నం.94156 06618, 98557 37578, 98857 38387, 8520 041973లలో సంప్రదించవచ్చని సూచించారు.
రేపు డిప్యూటీ సీఎం రాక
బల్మూర్: మండలంలోని గట్టుతుమ్మెన్ గ్రామానికి సోమవారం రాష్ట్ర ఉపముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క రానున్నారని ఎమ్మెల్యే వంశీకృష్ణ తెలిపారు. ఈ మేరకు శనివారం గట్టుతుమ్మెన్‌లో ఏర్పాటు చేయనున్న సభాస్థలాన్ని ఎమ్మెల్యే పరిశీలించారు. గ్రామంలో విద్యుత్ సబ్‌స్టేషన్ నిర్మాణం కోసం శంకుస్థాపన చేసి, అనంతరం నియోజకవర్గ ప్రజలతో ఏర్పాటు చేసిన సభలో పాల్గొంటారని చెప్పారు.